Share News

ఆర్థిక స్థిరత్వానికే ప్రాధాన్యత

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:57 AM

కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని ఎవరెంత అరిచి గీపెట్టినా, తమ వైఖరి మారదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి స్పష్టం చేసింది. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడమే తమ ప్రథమ ప్రాధాన్యత...

ఆర్థిక స్థిరత్వానికే ప్రాధాన్యత

గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ

కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు భేష్‌

ధరల సెగ తగ్గుతుంది

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

ముంబై: కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని ఎవరెంత అరిచి గీపెట్టినా, తమ వైఖరి మారదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి స్పష్టం చేసింది. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పింది. తాజాగా విడుదల చేసిన డిసెంబరు-24 సంచికలో ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’కు రాసిన ముందు మాటలో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వృద్ధి రేటును పక్కన పెట్టి ద్రవ్యోల్బణ కట్టడిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయం స్పష్టం చేయడం విశేషం.


కోలుకుంటోంది..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో మన జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోయింది. సెప్టెంబరు త్రైమాసికంలో అయితే ఏడు నెలల కనిష్ఠ స్థాయి 5.4 శాతాన్ని తాకింది. అయితే అంతర్జాతీయంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఈ ఏడాది అక్టోబరు నుంచి మన ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందని మల్హోత్రా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆర్థిక భవిష్యత్‌పై వ్యాపార సంస్థలు, వినియోగదారుల నమ్మకం పెరగడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. కంపెనీల లాభాలు పెరగడంతో పెట్టుబడులూ గాడిన పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని సమస్యలు ఉన్నా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుతం ఆశాజనకంగానే కనిపిస్తోందని తెలిపారు.


తగ్గిన ఎన్‌పీఏల భారం: దేశ బ్యాంకింగ్‌ రంగం ఆర్థిక స్థితి గతులు మరింత మెరుగుపడ్డాయని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలోని 37 వాణిజ్య బ్యాంకుల మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయి (జీఎన్‌పీఏ)ల వాటా 12 ఏళ్ల కనిష్ఠ స్థాయి 2.6 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఇందులో టాప్‌-100 బడాబాబుల వాటా 34.6 శాతమని తెలిపింది. నికర ఎన్‌పీఏల భారమైతే ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నాటికి 0.6 శాతానికి పడిపోయింది. పరపతి డిమాండ్‌ పెరగడం, రుణ వసూళ్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. అయితే బ్యాంకింగ్‌ వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల్లో రుణాల కొట్టివేతలు (రైటాఫ్‌) పెరిగి పోవడంపై మాత్రం ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.


నిష్ర్కియా ఖాతాలపై జాగ్రత్త: దేశ బ్యాంకింగ్‌ రంగంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలపైనా ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేటుగాళ్లకు చెక్‌ పెట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిష్ర్కియా (మ్యూల్‌) ఖాతాలపై ఒక కన్నేసి ఉంచాలని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే దేశ బ్యాంకింగ్‌ రంగంలో 18,461 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. ఈ నేరాల ద్వారా సైబర్‌ నేరస్థులు బ్యాంకు ఖాతాదారుల నుంచి రూ.21,367 కోట్లు కొట్టేశారు.

గత ఏడాది ఇదే కాలంలో కొట్టేసిన రూ.2,623 కోట్లతో పోలిస్తే ఇది ఎనిమిదింతలు ఎక్కువని ఆర్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు వీరి బారిన పడకుండా ఉండేందుకు, బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్‌బీఐ సూచించింది.


ఆర్‌టీజీపీఎస్‌, నెఫ్ట్‌ చెల్లింపులకీ

లుక్‌-అప్‌ సౌలభ్యం

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ చెల్లింపులకూ ‘లుక్‌-అప్‌’ సౌలభ్యాన్ని విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అప్పటిలోగా ఇందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి బ్యాంకులకు అందుబాటులోకి తేవాలని భారత జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్‌పీసీఐని కోరింది. ప్రస్తుతం యూపీఐ, ఐఎంపీఎస్‌ చెల్లింపులకు మాత్రమే ఈ లుక్‌-అప్‌ సౌకర్యం ఉంది. ఈ విధానంలో ఎవరికి నగదు బదిలీ చేయాలో అతడి బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లింపు ప్రారంభించే ముందే మనకు కనిపిస్తాయి. అది నగదు అందుకునే వ్యక్తి నిజమైన ఖాతా అని నిర్ధారణ చేసుకున్నాకే, నగదు బదిలీ చేయవచ్చు. ఇప్పుడు ఈ విధానాన్ని ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ చెల్లింపులకూ విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకింగ్‌ నేరాలకూ చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.


రిటైల్‌ రుణాలపై పారా హుషార్‌

చెల్లింపులకు హామీలేని క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాల వంటి రిటైల్‌ రుణాల ఎగవేతలపైనా ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో ఎక్కువ మందికి ఇప్పటికే ఇతర సెక్యూర్డ్‌ రుణాల చెల్లింపుల భారం ఉంటుందనే విషయాన్ని బ్య్యాంకులు, ఆర్థిక సంస్థలు గుర్తించాలని కోరింది. కొవిడ్‌కు ముందు ఏటా 14.8 శాతం చొప్పున పెరిగిన కన్స్యూమర్‌ రుణాలు, ఇప్పుడు ఏటా 20.6 శాతం చొప్పున పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది.

Updated Date - Dec 31 , 2024 | 05:57 AM