Share News

నాట్కో కొత్తూరు ప్లాంట్‌లో అంతా అపరిశుభ్రతే

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:04 AM

తెలంగాణలోని కొత్తూరు గ్రామంలో ఉన్న నాట్కో ఫార్మా ఫినిష్డ్‌ ఉత్పత్తుల ప్లాంట్‌ పరిశుభ్రతను పాటించడంలో విఫలమైందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఆరోపించింది...

నాట్కో కొత్తూరు ప్లాంట్‌లో అంతా అపరిశుభ్రతే

యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక

న్యూఢిల్లీ: తెలంగాణలోని కొత్తూరు గ్రామంలో ఉన్న నాట్కో ఫార్మా ఫినిష్డ్‌ ఉత్పత్తుల ప్లాంట్‌ పరిశుభ్రతను పాటించడంలో విఫలమైందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఆరోపించింది. ప్లాంట్‌లో ఉపయోగించే పరికరాలు, పాత్రలను నిర్దిష్ఠ కాలపరిమితిలో క్రమం తప్పకుండా శుభ్రం చేయలేదని అభియోగం మోపింది. ఈ మేరకు నాట్కో ఫార్మాకు హెచ్చరిక లేఖ పంపింది. గత ఏడాది అక్టోబరు 9వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో ఎఫ్‌డీఏ బృందం ఈ ప్లాంట్‌ను తనిఖీ చేసింది. ‘‘మీ ప్లాంట్‌లో ఔషధాలకు తీసుకోవలసిన శుభ్రత చర్యలు తీసుకోలేదు. పరికరాలు, పాత్రలు క్రమం తప్పకుండా శానిటైజ్‌ లేదా స్టెరిలైజ్‌ చేయలేదు. ఇది ఔషధ భద్రత, నాణ్యత, స్వచ్ఛతలకు విఘాతం కలిగించేదిగా ఉంది’’ అని ఆ లేఖలో పేర్కొంది. ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన ఔషధాల శాంపిల్స్‌ పరీక్షించగా ఉత్పత్తులు కాలుష్యరహితంగా ఉన్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. అలాగే ఒక బ్యాచ్‌లోని ఔషధాలు లేదా వాటిలో ఉపయోగించిన పదార్థాలు నిర్దేశిత భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నాయా లేవా ఆ బ్యాచ్‌ ఔషధాలు అప్పటికే పంపిణీ నెట్‌వర్క్‌కు వెళ్లాయా అని నిశితంగా తనిఖీ చేయడంలో కూడా కంపెనీ విఫలమైందని ఆరోపించింది. వీటన్నింటిపై సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఈ దిద్దుబాటు చర్యలు పూర్తయ్యే వరకు ఈ ప్లాంట్‌ నుంచి అమెరికా మార్కెట్‌కు పంపే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కోరింది. తయారీ కార్యకలాపాలు పునరుద్ధరించాలనుకుంటే ముందుగా తమకు తెలియచేయాలని సూచించింది.

Updated Date - Apr 22 , 2024 | 04:04 AM