Share News

బీఏఎస్‌ఎఫ్‌ నుంచి ‘ఎఫికాన్‌’ కీటక నాశిని

ABN , Publish Date - May 07 , 2024 | 03:11 AM

ప్రముఖ పురుగు మందుల తయారీ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌ ‘ఎఫికాన్‌’ పేరుతో ప్రత్యేక క్రిమిసంహారక మందును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పత్తి వంటి వాణిజ్య పంటలతో పాటు...

బీఏఎస్‌ఎఫ్‌ నుంచి ‘ఎఫికాన్‌’ కీటక నాశిని

280 ఎంఎల్‌ బాటిల్‌ ధర రూ.1,830

హైదరాబాద్‌: ప్రముఖ పురుగు మందుల తయారీ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌ ‘ఎఫికాన్‌’ పేరుతో ప్రత్యేక క్రిమిసంహారక మందును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పత్తి వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయల మొక్కలను నాశనం చేసే పేను బంక, తెల్ల దోమ, పచ్చ దోమలను ఈ మందు సమర్ధవంతంగా అడ్డుకుంటుందని కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంత అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సైమన్‌ బర్గ్‌ విలేకరులతో చెప్పారు. భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఈ క్రిముల కారణంగా పంటల ఉత్పాదకత 35 నుంచి 40 శాతం పడిపోతోంది. ఎఫికాన్‌ ఈ బెడదను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని బర్గ్‌ తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల రైతులు ఈ క్రిమినాశిని మందును ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. రూ.1,830 ధరతో 280 ఎంఎల్‌ బాటిల్స్‌లో ఇది లభిస్తుందని బీఏఎస్‌ఎఫ్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ గిరిధర్‌ రణువ చెప్పారు. ఎకరా పైరుకు ఒక 280 బాటిల్‌ ఎఫికాన్‌ సరిపోతుందన్నారు. పిచికారీ చేసిన తర్వాత పంటలపై దీని ప్రభావం చాలా కాలం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ క్రిమినాశిని మందుకు అవసరమైన ఫార్ములేషన్‌ను సింగపూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ ఫార్ములేషన్‌ను భారత్‌లో తయారు చేస్తామన్నారు. వచ్చే ఏడాది వరి పంటకు సోకే క్రిమి కీటకాలను నాశనం చేసే ప్రత్యేక క్రిమిసంహారక మందును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు గిరిధర్‌ చెప్పారు.

Updated Date - May 07 , 2024 | 03:11 AM