ఆర్థిక సంస్కరణలు కొనసాగాల్సిందే
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:26 AM
ధరల పోటు నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపు పరిధిలోని అట్టడుగు శ్లాబులో ఉన్న వారిని ఆదుకోవాలని బారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వాన్ని కోరింది...

అట్టడుగు శ్లాబు వారిని కరుణించాలి: సీఐఐ
బడ్జెట్ విన్నపాలు
న్యూఢిల్లీ: ధరల పోటు నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపు పరిధిలోని అట్టడుగు శ్లాబులో ఉన్న వారిని ఆదుకోవాలని బారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం వారి కోసం ప్రత్యేక పన్ను రాయితీలు ప్రకటించాలని కొత్తగా సీఐఐ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి కోరారు. భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు, విద్యుత్, వ్యవసాయ సంస్కరణలపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్ర-రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సంకీర్ణ ప్రభుత్వం సంస్కరణల కొనసాగింపునకు అడ్డంకి అవుతుందని తాము భావించడం లేదని పురి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పెట్టుబడులు, ద్రవ్య లోటు కట్టడి, సామాజిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు సంబందించిన రోడ్ మ్యాప్, హరిత పరిశ్రమల ప్రోత్సాహం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు, గ్రామీణ అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఐఐ కోరింది. వరుణుడు కరుణిస్తే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదాయ పన్ను చట్టాన్ని ముఖ్యంగా టీడీఎస్ వసూలు విధానాన్ని మరింత సంస్కరించాల్సిన అవసరం ఉందని పురి స్పష్టం చేశారు.