నోవార్టిస్ ఇండియాపై డాక్టర్ రెడ్డీస్ నజర్!
ABN , Publish Date - Feb 18 , 2024 | 02:39 AM
దేశ ఫార్మా రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ ఏజీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ నోవార్టిస్ ఇండియాను అమ్మకానికి పెట్టింది. ఈ లిస్టెడ్ కంపెనీలో...
మెజారిటీ వాటా కోసం చర్చలు
న్యూఢిల్లీ: దేశ ఫార్మా రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ ఏజీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ నోవార్టిస్ ఇండియాను అమ్మకానికి పెట్టింది. ఈ లిస్టెడ్ కంపెనీలో తనకున్న 70.68 శాతం వాటాను విక్రయించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ వాటా కొనుగోలుకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నిరాకరించింది. నోవార్టిస్ ఇండియా మాత్రం ‘నోవార్టిస్ ఏజీ భారత్‌లోని తన వ్యాపారాలను వ్యూహాత్మకంగా సమీక్షిస్తోంది. నోవార్టిస్ ఇండియా ఈక్విటీలో ఉన్న 70.68 శాతం వాటా అమ్మకం కూడా ఇందులో భాగం. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్‌తో మార్కెటింగ్ డీల్
నోవార్టిస్ ఇండియా ఇప్పటికే అమ్మకాలు, మార్కెటింగ్ నుంచి తప్పుకుంది. కంపెనీ ఉత్పత్తి చేసే ఔషధాలను డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్ మార్కెట్ చేస్తోంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య 2022 ఫిబ్రవరిలోనే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద నోవార్టిస్ ఇండియా ఉత్పత్తి చేసే వోవెరన్, కాల్షియం, మెథెర్జిన్ ఔషధాలను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్ చేస్తోంది. నోవార్టిస్ ఇండియా ఈక్విటీలో 70.68 శాతం వాటా కొనుగోలు ద్వారా ఫార్మా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని డాక్టర్ రెడ్డీస్ యోచిస్తున్నట్టు సమాచారం.