Share News

జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాపై డాక్టర్‌ రెడ్డీస్‌ ఆసక్తి

ABN , Publish Date - May 26 , 2024 | 05:22 AM

అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ మెజారిటీ వాటా కలిగిన జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. మ్యాన్‌కైండ్‌ ఫార్మా, టొరెంట్‌ ఫార్మా సైతం...

జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాపై డాక్టర్‌ రెడ్డీస్‌ ఆసక్తి

పోటీలో మ్యాన్‌కైండ్‌ ఫార్మా, టొరెంట్‌ సైతం..

ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ మెజారిటీ వాటా కలిగిన జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. మ్యాన్‌కైండ్‌ ఫార్మా, టొరెంట్‌ ఫార్మా సైతం జేబీ కెమికల్స్‌ కోసం పోటీలో ఉన్నాయని, తొలి రౌండ్‌ బిడ్డింగ్‌ కొద్ది వారాల్లో ప్రారంభం కావచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సహా మూడు కంపెనీలు నిరాకరించాయి. కేకేఆర్‌, జేబీ కెమికల్స్‌ సైతం స్పందించలేదు.


ముంబైకి చెందిన లిస్టెడ్‌ కంపెనీ అయిన జేబీ కెమికల్స్‌ షేరు ధర శుక్రవారం బీఎ్‌సఈలో 0.61 శాతం తగ్గి రూ.1,668.40 వద్ద ముగియగా.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.25,894 కోట్ల స్థాయి లో నమోదైంది. కాగా, జేబీ కెమికల్స్‌లో కేకేఆర్‌ 53.78 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 46.22 శాతం వాటా పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల చేతుల్లో ఉంది. శుక్రవారం నాటికి జేబీ కెమికల్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, సంస్థలో కేకేఆర్‌ వాటా విలువ రూ.14,000 కోట్ల పైమాటే. 2020 జూలైలో జేబీ కెమికల్స్‌ వ్యవస్థాపకులైన మోదీ కుటుంబం నుంచి మెజారిటీ వాటాను కేకేఆర్‌ రూ.3,100 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో కంపెనీకి చెందిన ఒక్కో షేరుకు రూ.745 చొప్పున చెల్లించింది. కేకేఆర్‌ యాజమాన్యంలో జేబీ కెమికల్స్‌ ఆదాయం రెట్టింపైంది. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,606 కోట్ల స్థాయిలో ఉన్న రెవెన్యూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3,484 కోట్లకు చేరుకుంది. అలాగే, సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం దాదాపు నాలుగింతలు పెరిగింది


కొనుగోళ్లపై టాప్‌ ఫార్మా కంపెనీల ఫోకస్‌

దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు దేశీయంగా, అంతర్జాతీయంగా తమ మార్కెట్‌ పరిధితో పాటు ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు ఇతర కంపెనీల కొనుగోళ్లపై ప్రధానంగా దృష్టిసారించాయి. ఇందుకోసం రూ.30,000 కోట్ల నగదు నిల్వలను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే, జేబీ కెమికల్స్‌పై ఆసక్తిగా ఉన్న మ్యాన్‌కైండ్‌ ఫార్మా.. ముంబైకి చెందిన బయో ఫార్మా కంపెనీ భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ కొనుగోలు కోసమూ పోటీపడుతోంది. మరోవైపు వైద్య పరికరాల తయారీ సంస్థ హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ కొనుగోలు కోసం ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ క్రిస్‌క్యాపిటల్‌తో కలిసి బిడ్‌ వేసింది.


అయితే, హెల్తియమ్‌ను కేకేఆర్‌ చేజిక్కించుకుంది. కాగా, థెరపీ సెగ్మెంట్లో పట్టు సాధించడంతో పాటు భారత్‌లో మరింత విస్తరించేందుకు బడా కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం ఇన్వెస్టర్లకు సిప్లా సంకేతాలిచ్చింది. అలాగే, అమెరికాలో పలు కంపెనీల ఔషధ ఉత్పత్తుల కొనుగోలు అవకాశాల కోసం చూస్తున్నట్లు సిప్లా తెలిపింది. గ్లోబల్‌డేటా డీల్స్‌ డేటాబేస్‌ ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయ ఫార్మా రంగంలో 45.63 కోట్ల డాలర్ల విలువైన 24 విలీన, కొనుగోలు ఒప్పందాలు జరిగాయి.

Updated Date - May 26 , 2024 | 05:22 AM