Share News

‘కార్వీ’ కేసులో ఒత్తిడి చేయొద్దు

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:15 AM

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో తమపై దయ చూపాలని నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌).. సుప్రీంకోర్టును కోరింది. గత ఏడాది డిసెంబరు 13న సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌...

‘కార్వీ’ కేసులో ఒత్తిడి చేయొద్దు

ఒత్తిడి చేస్తే దుకాణం మూతే : ఎన్‌ఎస్‌డీఎల్‌

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో తమపై దయ చూపాలని నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌).. సుప్రీంకోర్టును కోరింది. గత ఏడాది డిసెంబరు 13న సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ అఽథారిటీ ట్రైబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఒత్తిడి చేయవద్దని కోరింది. శాట్‌ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సి వస్తే, సంస్థను మూసివేయడం తప్ప తమ క్లయింట్‌కు మరో మార్గం లేదని ఎన్‌ఎస్‌డీఎల్‌ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. సెబీ ఆదేశాల ప్రకారం ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ డీమ్యాట్‌ ఖాతాలను స్తంభింప చేయడం ‘బహిరంగ దారిదోపిడీ’ అని శాట్‌ గత ఏడాది ఇచ్చిన తీర్పులో పేర్కొంది. అంతేకాకుండా ఇందుకు సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌, ఎన్‌ఎస్‌ఈ సంస్థలు షేర్లు తాకట్టు పెట్టుకుని కార్వీకి అప్పులిచ్చిన బ్యాంకులకు రూ.1,433 కోట్ల మొత్తాన్ని ఏటా 10 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఎస్‌డీఎల్‌ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

Updated Date - Jan 30 , 2024 | 06:31 AM