Share News

దివీస్‌ లేబొరేటరీస్‌ డివిడెండ్‌ 1,500%

ABN , Publish Date - May 26 , 2024 | 05:19 AM

దివీస్‌ లేబొరేటరీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 67 శాతం వృద్ధి...

దివీస్‌ లేబొరేటరీస్‌ డివిడెండ్‌ 1,500%

ఒక్కో షేరుకు రూ.30 డివిడెండ్‌ సిఫారసు

క్యూ4 లాభం రూ.538 కోట్లు

హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 67 శాతం వృద్ధి చెంది రూ.538 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే కాలంలో నికర లాభం రూ.321 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.2,017 కోట్ల నుంచి రూ.2,382 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ.1,551 కోట్ల నుంచి రూ.1,669 కోట్లకు పెరిగింది. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.2,338 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.531 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో ఫారెక్స్‌ నష్టాలు రూ.కోటిగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,184 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.1,600 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.8,112 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.1,824 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


కాగా ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 1,500 శాతం (రూ.30) డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు దివీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది.

Updated Date - May 26 , 2024 | 05:19 AM