Share News

అభివృద్ధే మన తారక మంత్రం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:19 AM

వచ్చే సంవత్సరాని (2025) కి సుస్థిర అభివృద్ధే మన లక్ష్యం కావాలని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ‘ఎక్స్‌’లో తన అభిప్రాయాలను....

అభివృద్ధే మన తారక మంత్రం

ఉదయ్‌ కోటక్‌

అతి నియంత్రణలతో అనర్థమే

పోటీ సామర్ధ్యం పెంచుకోవాలి

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరాని (2025) కి సుస్థిర అభివృద్ధే మన లక్ష్యం కావాలని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ‘ఎక్స్‌’లో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమన్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సూచించారు. అతి నియంత్రణలను తొలగించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే మన పారిశ్రామికవేత్తల అసలు సిసలు సామర్ధ్యం బయట పడుతుందన్నారు.


పోటీ సత్తా పెంచుకోవాలి: కార్మికుల ఉత్పాదకత పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయ పోటీకి తగ్గట్టు మన పరిశ్రమలు ఎదగాలని ఉదయ్‌ కోటక్‌ సూచించారు. వాణిజ్య రక్షణ విధానాలతో స్వల్పకాలిక లాభాలే తప్ప దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ రక్షణ విధానాలు దీర్ఘకాలం కొనసాగితే మన పరిశ్రమల పోటీ సామర్ధ్యమూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్థిక స్థిరత్వం కోసం ద్రవ్యలోటుతో పాటు మూలధన ఖాతా లోటును (సీఏడీ) తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

‘రక్షణ’తోనే సౌభాగ్యం: దేశ రక్షణ, భద్రతలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోటక్‌ సూచించారు. ఈ రెండూ ఉంటేనే దేశ సౌభాగ్యానికి అర్థం ఉంటుందన్నారు. అక్రమాలు, గాలి బుడగలు ఏర్పడితే తప్ప ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో కోటక్‌ ఈ సూచనలు చేయడం విశేషం.

Updated Date - Dec 30 , 2024 | 04:19 AM