కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:28 AM
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. రూ.800 కోట్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా....

కాకినాడ, అంకలేశ్వర్‌లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. రూ.800 కోట్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కాకినాడలో గ్రాన్యులేషన్ ప్లాంట్‌ను నెలకొల్పటంతో పాటు గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో పెస్టిసైడ్స్ కోసం ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. విస్తరణలో భాగంగా కాకినాడలోని కాంప్లెక్స్, ప్రత్యేక ఎరువుల తయారీ ప్లాంట్‌లో కొత్తగా ఏటా 7.5 లక్షల టన్నుల సామర్థ్యంతో గ్రాన్యులేషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త లైన్‌తో కాకినాడ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 30 లక్షల టన్నులకు చేరుకుంటుందని పేర్కొంది. అలాగే సెనెగల్‌లోని బావోబాబ్ మైనింగ్ కెమికల్ కార్పొరేషన్ (బీఎంసీసీ)లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
క్యూ2 లాభం రూ.696 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)లో కంపెనీ స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.7,509 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.696 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.7,031 కోట్లుగా ఉండగా లాభం రూ.762 కోట్లుగా ఉంది.