విద్యార్థులకు కెనరా బ్యాంక్ ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Aug 16 , 2024 | 01:34 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ వినూత్నమైన సేవలకు శ్రీకారం చుట్టింది. గురువారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బ్యాంక్ ఎండీ, సీఈఓ...
విద్యార్థినికి చెక్ అందజేస్తున్న బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ వినూత్నమైన సేవలకు శ్రీకారం చుట్టింది. గురువారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బ్యాంక్ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనరా బ్యాంక్ ప్రతి శాఖ పరిధిలోను కనీసం ఆరేడు మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకి చెందిన విద్యార్థినులకు డాక్టర్ అంబేడ్కర్ విద్యాజ్యోతి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 44,700 మంది విద్యార్థినులకు రూ.17.20 కోట్ల మేర నగదు బదిలీ చేశామన్నారు. ఏటా పేద బాలికలకు ప్రోత్సహించే విధానం కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామీణ బ్యాంకు శాఖ పరిధిలో పేద బాలికను దత్తత తీసుకుని ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు చదివిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే బ్యాంకులో వివిధ హోదాలలో పనిచేసి అనారోగ్యం, ప్రమాదాలతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు.
ఐదేళ్లుగా ఈ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్హతను బట్టి 150 మందికి ఉద్యోగాలిచ్చినట్లు చెప్పారు. స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్‌ను రూ.45 కోట్ల నుంచి 90 కోట్లకు పెంచేందుకు అనుమతులు లభించాయని ఉద్యోగులతో పాటు రిటైర్డ్ అయి న వారికి కూడా అన్ని సౌలభ్యాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.