Share News

జూన్‌ చివరి నాటికి స్మార్ట్‌ టీవీలు మరింత ప్రియం

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:18 AM

ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి స్మార్ట్‌ టీవీల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ప్యానెళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో స్మార్ట్‌ టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను...

జూన్‌ చివరి నాటికి స్మార్ట్‌ టీవీలు మరింత ప్రియం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి స్మార్ట్‌ టీవీల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ప్యానెళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో స్మార్ట్‌ టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను కూడా పెంచాల్సి రావచ్చని కౌంటర్‌పాయింట్‌ అధ్యయన నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, ఈ ఏడాది స్మార్ట్‌ టీవీల విక్రయాలు 9 శాతం మేర పెరగవచ్చని అంచనా వేసింది. ప్రీమియం మోడళ్లకు గిరాకీ పెరగడంతోపాటు వినియోగదారులు బడా సైజు టీవీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం ఇందుకు దోహదపడనుందని రిపోర్టులో ప్రస్తావించింది. గత ఏడాదిలో మాత్రం దేశంలో స్మార్ట్‌ టీవీల విక్రయాలు 16 శాతం తగ్గాయి. గత ఏడాది ప్రథమార్ధంలో ఆర్థికపరమైన సవాళ్లతోపాటు డీలర్ల వద్ద అప్పటికే నిల్వలు భారీ స్థాయిలో పేరుకుపోయి ఉండటం అందుకు కారణమైందని నివేదిక తెలిపింది.

ఆన్‌లైన్‌ కొనుగోళ్ల జోరు

ఈ-కామర్స్‌ పోర్టళ్ల ద్వారా స్మార్ట్‌ టీవీల కొనుగోళ్లు మరింత పుంజుకోవచ్చని.. ఈ వేదికలపై కొనుగోలుదారుల్లో నమ్మకం పెరుగుతోందని కౌంటర్‌పాయింట్‌ రిపోర్టు పేర్కొంది. ప్రీమియం మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం టీవీ మార్కెట్‌ సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) కూడా పెరగనుంది. మొత్తం టీవీ విక్రయాల్లో స్మార్ట్‌ టీవీల వాటా ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 93 శాతానికి చేరుకుందని రిపోర్టు వెల్లడించింది. ఖరీదైన క్యూఎల్‌ఈడీ టీవీలకూ క్రమంగా ఆదరణ పెరుగుతోందని.. టీసీఎల్‌, హైసెన్స్‌, ఏసర్‌, కొడాక్‌, థామ్సన్‌ వంటి కంపెనీలు 43 అంగుళాల సైజులో మరియు రూ.30,000లోపు మోడళ్లలోనూ క్యూఎల్‌ఈడీ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చాయంది. దాంతో గత ఏడాది ఈ టీవీల విక్రయాలు రెట్టింపునకు పైగా పెరిగాయి. ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదికలు, ఐపీఎల్‌ ఇంకా ఇతర స్పోర్ట్స్‌ టోర్నమెంట్లు స్మార్ట్‌ టీవీలకు డిమాండ్‌ పెంచుతున్నాయని కౌంటర్‌పాయింట్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అన్షిక జైన్‌ అన్నారు.

Updated Date - Mar 31 , 2024 | 02:18 AM