Share News

లగ్జరీ ఫ్లాట్లపైనే బిల్డర్ల దృష్టి

ABN , Publish Date - May 27 , 2024 | 02:53 AM

హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్‌ మారిపోతోంది. రూ.60 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల జోలికి కొనుగోలుదారులు పెద్దగా పోవడం లేదు. దీంతో...

లగ్జరీ ఫ్లాట్లపైనే బిల్డర్ల దృష్టి

  • ‘అందుబాటు’ ఫ్లాట్లకు తగ్గిన గిరాకీ

న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్‌ మారిపోతోంది. రూ.60 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల జోలికి కొనుగోలుదారులు పెద్దగా పోవడం లేదు. దీంతో బిల్డర్లు కూడా ఈ తరహా ఫ్లాట్ల నిర్మాణం తగ్గించేశారు. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ.60 లక్షల వరకు ధర ఉన్న 33,420 ఫ్లాట్ల నిర్మాణాన్ని బిల్డర్లు చేపట్టారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువని రియల్‌ ఎస్టేట్‌ అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. హైదరాబాద్‌లో గత ఏడాది తొలి త్రైమాసికంలో 2,319 యూనిట్ల అందుబాటు ధరల ఫ్లాట్ల నిర్మాణం జరగ్గా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో అది 2,116 యూనిట్లకు పడిపోయింది.


కారణాలేమిటంటే: గత రెండేళ్లలో నగరాల్లో భూము ల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. నిర్మాణ ఖర్చులూ గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు కొవిడ్‌ తర్వాత ఎక్కువ మంది.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు పెద్దపెద్ద విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్లపై ఆసక్తి చూపడం పెరిగింది. దీంతో బిల్డర్లు అందుబాటు ధరల ఫ్లాట్ల నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. ప్రస్తుతం ఎక్కువ మంది బిల్డర్లు ఎక్కువ విస్తీర్ణం ఉండే లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. గత ఏడాది కూడా రూ.60 లక్షల వరకు ధర ఉన్న ఫ్లాట్ల నిర్మాణం 2022తో పోలిస్తే 20 శాతం పడిపోయిన విషయాన్ని ప్రాప్‌ఈక్విటీ గుర్తు చేసింది.

Updated Date - May 27 , 2024 | 02:53 AM