Share News

బోణీ డీలా!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:52 AM

దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ చేశాయి. సాధారణంగానే ఐటీ రంగానికి క్యూ3 బలహీన త్రైమాసికం. ఈ రంగానికి అధిక ఆదాయ మార్కెట్లు అయిన అమెరికా, ఐరోపాలో ఆర్థిక మందగమనం...

బోణీ డీలా!

దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ చేశాయి. సాధారణంగానే ఐటీ రంగానికి క్యూ3 బలహీన త్రైమాసికం. ఈ రంగానికి అధిక ఆదాయ మార్కెట్లు అయిన అమెరికా, ఐరోపాలో ఆర్థిక మందగమనం గడిచిన మూడు నెలల్లో ఐటీ కంపెనీల పనితీరును మరింత ప్రభావితం చేసింది. దాంతో సమీక్షా కాలానికి టీసీఎస్‌ లాభం స్వల్ప వృద్ధికి పరిమితం కాగా.. ఇన్ఫీ ప్రాఫిట్‌ క్షీణించింది. మార్కెట్‌ అంచనాలను కూడా అందుకోలేకపోయింది.

టీసీఎస్‌ లాభం రూ.11,735 కోట్లు

ఆదాయం రూ.60,583 కోట్లు

అంచనాల కంటే తగ్గిన ఆర్డర్లు జూ ఒక్కో షేరుకు రూ.27 డివిడెండ్‌

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) టీసీఎస్‌ ఆర్థిక పనితీరు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే నమోదైంది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 8.2 శాతం వృద్ధితో రూ.11,735 కోట్లకు చేరుకోగా.. ఆదాయం 4 శాతం పెరిగి రూ.60,583 కోట్లుగా నమోదైంది. భారత్‌ సహా వర్ధమాన మార్కెట్లో కంపెనీ వ్యాపారం రెండంకెల్లో వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. ఎనర్జీ, రిసోర్సెస్‌, యుటిలిటీస్‌, మాన్యుఫాక్చరింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ రంగా క్లయింట్ల నుంచి ఆదాయం పెరగడం కూడా కలిసివచ్చిందని కంపెనీ పేర్కొంది. సమీక్షా కాలానికి టీసీఎస్‌ నిర్వహణ మార్జిన్‌ 0.50 శాతం వృద్ధితో మార్కెట్‌ అంచనాలను మించి 25 శాతానికి ఎగబాకింది. కాగా, నికర మార్జిన్‌ 19.4 శాతంగా నమోదైంది. మరిన్ని విషయాలు..

  • గడిచిన మూడు నెలల్లో కంపెనీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ 810 కోట్ల డాలర్లకు పరిమితమైంది. క్యూ2లో లభించిన 1,120 కోట్ల డాలర్ల ఆర్డర్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అంతేకాదు, కంపెనీ అంచనా 900-1,000 కోట్ల డాలర్ల కన్నా తక్కువే.

  • ఈ ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్‌ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకు మొత్తం రూ.27 డివిడెండ్‌ ప్రకటించింది. అందులో రూ.9 మధ్యంతర డివిడెండ్‌ కాగా, మరో రూ.18 ప్రత్యేక డివిడెండ్‌నూ చెల్లించనుంది. తొలి, రెండో త్రైమాసికాల్లోనూ కంపెనీ రూ.9 చొప్పున మధ్యంతర డివిడెండ్లను చెల్లించింది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు సంస్థ ప్రకటించిన మొత్తం డివిడెండ్‌ రూ.45కు చేరుకుంది. డివిడెండ్‌కు అర్హులైన వాటాదారులను ఈ నెల 19న రికార్డు చేసి, వచ్చే నెల 5న చెల్లింపులు జరపనున్నట్లు కంపెనీ తెలిపింది.

  • గడిచిన త్రైమాసికంలో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 5,680 తగ్గి 6,03,305కు పడిపోయింది. వరుసగా రెండు త్రైమాసికాలుగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యూ2లో కంపెనీ నుంచి నికరంగా 6,333 మంది వలసపోయారు. కాగా, క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 13.3 శాతానికి తగ్గింది.

ఇన్ఫీ లాభంలో 7.3% క్షీణత

క్యూ3లో రూ.6,106 కోట్లకు పరిమితం

ఆదాయం రూ.38,821 కోట్లుగా నమోదు

బెంగళూరు: డిసెంబరు తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఇన్ఫోసిస్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 7.3 శాతం తగ్గి రూ.6,106 కోట్లకు పడిపోయింది. ఏకీకృత రాబడి మాత్రం 1.3 శాతం పెరిగి రూ.38,821 కోట్లకు చేరుకుంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి ఆదాయ అంచనాను గతంలో ప్రకటించిన 1-2.5 శాతం నుంచి 1.5-2 శాతానికి కుదిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గడిచిన మూడు త్రైమాసికాల్లో స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి 1.8 శాతంగా నమోదైందని, నాలుగో త్రైమాసిక పనితీరును కూడా దృష్టిలో పెట్టుకుని ఆదాయ అంచనాను కుదించినట్లు కంపెనీ పేర్కొంది. 20-22 శాతం నిర్వహణ మార్జిన అంచనాను మాత్రం యథాతథంగా కొనసాగించింది.

మరిన్ని ముఖ్యాంశాలు..

  • గడిచిన మూడు నెలల్లో ఓ మెగా డీల్‌తో కలిపి 320 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అందులో కొత్తగా లభించిన నికర ఆర్డర్ల విలువే 71 శాతమని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, క్యూ2లో లభించిన 770 కోట్ల డాలర్ల డీల్స్‌తో పోలిస్తే విలువ సగానికి పైగా తగ్గింది.

  • వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ ఇన్ఫీలో ఉద్యోగులు తగ్గారు. ఈ డిసెంబరుతో ముగిసిన మూడు నెలల్లో సంఖ్య వార్షిక ప్రాతిపదికన 7 శాతం (6,101) తగ్గి 3,22,663 మందికి పరిమితమైంది. అట్రిషన్‌ రేటు 12.9 శాతానికి తగ్గింది.

ఇన్ఫీ చేతికి ఇన్‌సెమీ

  • బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్ల (చిప్‌) డిజైనింగ్‌ సేవల కంపెనీ ‘ఇన్‌సెమీ’ని రూ.280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫీ బోర్డు ఆమోదం తెలిపింది. నియంత్రణ మండళ్ల అనుమతులకు లోబడి ఈ మార్చి చివరి నాటికల్లా డీల్‌ పూర్తి కావచ్చని అంచనా. ఇన్‌సెమీ కొనుగోలుతో ఇన్ఫోసిస్‌ కొత్త రంగంలోకి అడుగు పెట్టడమే కాకుండా, ఇప్పటివరకు ఈ రంగం నుంచి లేని క్లయింట్లను కూడా దక్కించుకునేందుకు వీలు కలుగనుందని కంపెనీ సీఎ్‌ఫఓ నీలాంజన్‌ రాయ్‌ అన్నారు. ప్రస్తుతం 50,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న సెమీకండక్టర్ల మార్కెట్‌ మరికొన్నేళ్లలో లక్ష కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.

ప్రాంగణ నియామకాల్లేవ్‌..

  • ఐటీ సేవలకు తగినంత డిమాండ్‌ లేని కారణంగా ఈ సారి ప్రాంగణ నియామకాలు చేపట్టకపోవచ్చని నీలాంజన్‌ రాయ్‌ తెలిపారు. ఒకవేళ మరింత మంది ఉద్యోగులు అవసరమైన పక్షంలో ఆఫ్‌-క్యాంపస్‌ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 05:52 AM