భారత్ జీపీటీ ‘హనుమాన్’ వచ్చేస్తోంది..
ABN , Publish Date - Feb 22 , 2024 | 06:18 AM
అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్లికేషన్ చాట్ జీపీటీ తరహా దేశీ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది...
వచ్చేనెలలో అందుబాటులోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్లికేషన్ చాట్ జీపీటీ తరహా దేశీ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఐఐటీ బాంబే నేతృత్వ భారత్ జీపీటీ ఎకోసిస్టమ్ భాగస్వామ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన సీతా మహాలక్ష్మి హెల్త్‌కేర్ (ఎ్‌సఎంఎల్) సంస్థ ‘హనుమాన్’ పేరుతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. వచ్చే నెలలోనే దీన్ని ఓపెన్ సోర్స్‌గా అందరికీ అందుబాటులోకి తేనున్నారు. ఈ లాంగ్వేజ్ మోడల్ హిందీ, తెలుగు, తమిళం సహా 11 దేశీయ భాషల్లో సేవలందించగలదు. దీని సేవల సామర్థ్యాన్ని భవిష్యత్‌లో 22 దేశీయ భాషలకు విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హనుమాన్ సేవలు: మల్టీ మోడల్ ఏఐ సామర్థ్యాలతో అభివృద్ధి చేస్తున్న హనుమాన్.. యూజర్లకు టెక్ట్స్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు వీడియో లేదా స్పీచ్ టు టెక్స్ట్, వీడియో టు టెక్స్ట్ విధానాల్లో సమాధానాలు అందించగలదు. తొలుత హెల్త్‌కేర్, గవర్నెన్స్, ఆర్థిక సేవలు, విద్యా విభాగాల్లో సేవలందించనుంది.
భారత్ జీపీటీ ఎకోసిస్టమ్ గురించి: దేశంలోని భిన్న భాషల్లో మాట్లాడే సామాన్యులకు సైతం చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ బాంబే నేతృత్వంలోని 8 ఐఐటీల రీసెర్చ్ కన్సార్షియమే భారత్ జీపీటీ ఎకోసిస్టమ్. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌తో పాటు అంబానీకి చెందిన ఎస్‌ఎంఎల్, రిలయన్స్ జియో ఈ ప్రాజెక్ట్‌కు మద్దతిస్తున్నాయి. దేశీయంగా జనరేటివ్ ఏఐ అప్లికేషన్ అభివృద్ధి కోసం ఏర్పాటైన తొలి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యమిది.