Share News

ఎఫ్‌ అండ్‌ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!

ABN , Publish Date - May 15 , 2024 | 02:39 AM

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులు పెరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులు పోటెత్తితే మార్కెట్‌తో...

ఎఫ్‌ అండ్‌ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!

రిటైల్‌ ఇన్వెస్టర్లను హెచ్చరించిన

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులు పెరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడులు పోటెత్తితే మార్కెట్‌తో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌, గృహ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్‌లో సవాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంద’’ని మంగళవారం బీఎ్‌సఈలో నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ 2047’ కార్యక్రమంలో సీతారామన్‌ హెచ్చరించారు. కుటుంబాల పొదుపులో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని, ఈక్విటీల్లోకి వచ్చే పొదుపు సొమ్ము గడిచిన కొన్నేళ్లలో అనూహ్యంగా పెరిగిందని, మన స్టాక్‌ మార్కెట్‌పైన నమ్మకానికిది ప్రతీక అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లో కొంత రిస్క్‌ ఉన్నప్పటికీ, మెరుగైన రిటర్నులు లభించే అవకాశాలుండటంతో మధ్యతరగతి ప్రజలు తమ పొదుపు సొమ్మును షేర్లలో పెట్టుబడిగా పెడుతున్నారని అన్నారు. వారికి మార్కెట్‌పై ఉన్న నమ్మకాన్ని పరిరక్షిస్తామన్నారు. కొన్ని నెలల క్రితం క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఓ అధ్యయాన్ని చేపట్టింది. ఎఫ్‌ అండ్‌ ఓ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోయారని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది. అప్పటి నుంచి డెరివేటివ్‌ కాంట్రాక్టుల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌పై సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ సహా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.


ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాలి..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీస్‌ పథకాల్లోకి మళ్లే పొదుపు సొమ్ము తగ్గిందని, అదే సొమ్ము క్యాపిటల్‌ మార్కెట్లోకి వచ్చి చేరుతోందని ఆర్థిక మంత్రి అన్నారు. కఠిన నిబంధనలు, పటిష్ఠమైన నియంత్రణ ప్రమాణాల ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంపొందించేందుకు సెబీతో కలిసి పనిచేయాలని బీఎ్‌సఈకి మంత్రి విజ్ఞప్తి చేశారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ వ్యవస్థాగత ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మార్కెట్‌ స్థిరత్వాన్ని కాపాడాలన్నారు.

మూడోసారీ మోదీనే..

ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కారణంగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గత కొన్ని రోజుల్లో తీవ్ర ఊగిసలాటలకు లోనవడంపై సీతారామన్‌ స్పందించారు. మూడోసారీ మోదీ ప్రభుత్వమే వస్తుందని, ఈసారీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. అంతేకాదు, ఈసారి తమ ప్రభుత్వం కనీస అధికారం..గరిష్ఠ పాలనపై దృష్టి సారించనున్నట్లు మంత్రి సంకేతాలిచ్చారు.

Updated Date - May 15 , 2024 | 02:39 AM