Share News

అన్నీ మంచి శకునములే...

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:54 AM

నూతన సంవత్సరం 2024 ఎన్నో ఆశలు చిగురింపచేస్తోంది. ఆర్థికరంగం, ఈక్విటీ మార్కెట్లు, నియామ కాలు, వేతన పెంపు అన్నింటిలోనూ ఆశావహ ధోరణులే ఉంటాయని అంటున్నారు...

అన్నీ మంచి శకునములే...

నూతన సంవత్సరం 2024 ఎన్నో ఆశలు చిగురింపచేస్తోంది. ఆర్థికరంగం, ఈక్విటీ మార్కెట్లు, నియామ కాలు, వేతన పెంపు అన్నింటిలోనూ ఆశావహ ధోరణులే ఉంటాయని అంటున్నారు. ప్రధానంగా కొత్త సంవత్సరం ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అన్ని రంగాలకు చోదకశక్తిగా నిలుస్తాయని మార్కెట్‌ పండితుల అంచనా. ఈ నేపథ్యంలో ఏఏ రంగం ఏ విధంగా ఉండవచ్చో పరిశీలిద్దాం.

భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సంపన్న దేశాల్లో నిరాశావహమైన వాతావరణం నెలకొన్నప్పటికీ అన్ని రకాల ఎదురుగాలులను తట్టుకుని భారత ఆర్థిక రంగం జోరును కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, స్థిరమైన వడ్డీ రేట్లు, శక్తివంతంగా ఉన్న విదేశీ మారకం నిల్వలు దేశీయ ఆర్థిక రంగానికి కుషన్‌లా పని చేస్తున్నాయి. ఈ వాతావరణంలో కొత్త సంవత్సరంలో కూడా భారత ఆర్థిక రంగం అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం ఖాయమని ఆర్థికవేత్తలంటున్నారు. సర్వత్రా నిరాశా నిస్పృహలు గూడు కట్టుకున్న స్థితిలో కూడా 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 7.7 వృద్ధి రేటుతో (క్యూ1- 7.8ు, క్యూ2- 7.6ు) చైనా సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటి కన్నా ముందువరుసలో నిలిచింది. ఓఈసీడీ ఎంతో కన్జర్వేటివ్‌గా ప్రకటించిన అంచనా ప్రకారం సైతం భారత ఆర్థిక వ్యవస్థ 2024 సంవత్సరంలో 6.1ు వృద్ధి సాధించే ఆస్కారం ఉంది. చైనా, బ్రెజిల్‌ దేశాల కన్నా ఇది చాలా మెరుగైన స్థితి. ఎన్నో ప్రతికూలతను సైతం తట్టుకుని 2023లో భారత్‌ వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో గరిష్ఠ స్థాయి 7.44 శాతంగా నమోదైనప్పటికీ నవంబరులో 5.55 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చినట్టయితే రెపోరేట్ల తగ్గింపు ప్రక్రియకు 2024లో ఆర్‌బీఐ శ్రీకారం చుట్టవచ్చు. మరోవైపు నాలుగు నెలల విరామం అనంతరం డిసెంబరులో విదేశీ మారకం నిల్వలు 60,000 కోట్ల డాలర్ల స్థాయిని దాటడం కూడా ఎలాంటి విదేశీ ఆటుపోట్లనైనా తట్టుకోగల స్థితి ఆర్థిక రంగానికి అందిస్తుందని పరిశీలకులంటున్నారు.

బుల్‌ జోరు ఆగదు

ఈక్విటీ మార్కెట్‌ గత తొమ్మిది వారాలుగా కనివిని ఎరుగని బుల్‌రన్‌లో పురోగమిస్తూ చారిత్రక రికార్డులను నమోదు చేసింది. కొత్త సంవత్సరంలో కూడా ఈ జోరు అలాగే కొనసాగవచ్చని మార్కెట్‌ పండితుల అంచనా. వడ్డీ రేట్లు, లోక్‌సభ ఎన్నికలు, భోగోళిక రాజకీయ అంశాలు మార్కెట్‌ దిశను నిర్దేశిస్తాయి. ఏది ఏమైనా వచ్చే 3-6 నెలల మధ్య కాలంలో ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ 7 శాతం వరకు వృద్ధి సాధించవచ్చన్నది వారి అభిప్రాయం.

రాజకీయ సుస్థిరత మార్కెట్లకు బలం చేకూరుస్తాయని పేర్కొంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మంచి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం కీలకమని వారన్నారు. అలాగే ఎన్నికల అనంతరం వచ్చే తొలి బడ్జెట్‌ కూడా మార్కెట్‌ దిశను నిర్దేశిస్తుందంటున్నారు. వీటన్నింటికీ తోడు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినట్టయితే బుల్‌ జోరుకు ఆకాశమే హద్దవుతుందన్నది మార్కెట్‌ పండితుల అభిప్రాయం. అమెరికాలో బాండ్లపై రాబడులు తగ్గడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత ఈక్విటీ పెట్టుబడులు ప్రారంభించడం ఒక శుభపరిణామమని వారంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొంత అప్రమత్తమైన ఆశావహ స్థితి నెలకొందని, ఇన్వెస్టర్లు తక్షణం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై దృష్టి పెడతారని నిపుణుల అభిప్రాయం.

జాబ్‌ మార్కెట్‌ ఆశావహం

2024 సంవత్సరం ఉపాధి మార్కెట్‌కు కూడా ఆశావహంగానే ఉండవచ్చని అంటున్నారు. డేటా చోదక నియామకాలు, వేతనాల్లో రెండంకెల వృద్ధి ఉండవచ్చని మానవ వనరుల రంగం నిపుణులంటున్నారు. కంపెనీలు నిపుణులైన మానవ వనరులను నియమించుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. గత కొద్ది సంవత్సరాల కాలంలో అటు యాజమాన్యాలు, ఇటు ఉద్యోగుల అంచనాల్లో విశేషమైన మార్పు ఏర్పడింది. పక్షపాతరహితమైన నియామక విధానాలు, పని ప్రదేశాల్లో మరింత అనుకూల వాతావరణం ఉండాలని ఉద్యోగులు కోరుతుండగా అత్యున్నత నైపుణ్యా లు గల వారిని నిలబెట్టుకునేందుకు అనుభవజ్ఞులకు పెద్ద పీట వేయాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, సానుకూల పని పరిస్థితులు, ఉద్యోగ-వ్యక్తిగత జీవితంలో సమతూకం కల్పించేందుకు యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి.

2023 సంవత్సరంలో ఎడ్‌టెక్‌ రంగంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ రంగంలో కూడా అప్రమత్త స్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరంలో ఐటీ నియామకాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించవచ్చని, అలాగే నైపుణ్యాల ఆధారంగా వేతనాలు ఇచ్చే వైఖరి ఏర్పడవచ్చని నిపుణులంటున్నారు. కృత్రిమమేథ, ఆటోమేషన్‌ సంబంధిత విభాగాలు ఉపాధి రంగాన్ని ఆశావహంగా నిలపవచ్చునన్నది వారి అభిప్రాయం. అయితే 2023తో పోల్చితే కొత్త సంవత్సరంలో వేతనాలు పెంపు స్వల్పంగా తగ్గవచ్చని వారంటున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 02:54 AM