Share News

విమాన ప్రయాణం మరింత భారం

ABN , Publish Date - May 27 , 2024 | 03:04 AM

దేశీయ మార్గాల్లో విమాన చార్జీలు అందనంత ఎత్తులో ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంలో కొన్ని ప్రధాన మారాల్లో టిక్కెట్ల చార్జీలు 40 శాతం పెరిగాయి. ప్రయాణికుల రద్దీ, చాలినన్ని విమానాలు అందుబాటులో లేకపోవడం...

విమాన ప్రయాణం మరింత భారం

40% పెరిగిన టికెట్‌ చార్జీలు.. 2026 వరకు బాదుడు తప్పదు:కాపా ఇండియా

న్యూఢిల్లీ: దేశీయ మార్గాల్లో విమాన చార్జీలు అందనంత ఎత్తులో ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంలో కొన్ని ప్రధాన మారాల్లో టిక్కెట్ల చార్జీలు 40 శాతం పెరిగాయి. ప్రయాణికుల రద్దీ, చాలినన్ని విమానాలు అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా ఒక నివేదికలో తెలిపింది. 2026 మార్చి వరకు ఈ బాదుడు తప్పకపోవచ్చని కాపా అంచనా వేస్తోంది. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో విమాన చార్జీలు ఇంకా అత్యంత తక్కువగానే ఉన్నట్టు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. మన దేశ జనాభాలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువ. రోజువారీగా చూసినా సగటున 4.5 లక్షలు మాత్రమే.


కాగా టికెట్‌ పెంపు ప్రభావం ఢిల్లీ-హైదరాబాద్‌ మార్గంతో పాటు ముంబై-ఢిల్లీ, బెంగళూరు-ఢిల్లీ, బెంగళూరు-ముంబై మార్గాలపైనా పడింది. ద్రవ్యోల్బణపరంగా చూస్తే దాదాపు 20 ఏళ్ల పాటు ఈ రూట్లలో టికెట్‌ చార్జీలు స్థిరంగానే ఉన్నాయి. కానీ గత ఏడాదిన్నర కాలంలో మాత్రం 40 శాతం పెరిగాయి. ప్రయాణికుల రద్దీకి తోడు దాదాపు 150 విమానాలు మూలన పడి ఉండడం ఇందుకు ప్రధాన కారణమని కాపా ఇండియా తెలిపింది. కొవిడ్‌ అనంతరం దేశీయంగా విమాన చార్జీలు పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం ఢిల్లీ-ముంబై మార్గంలో ఒకవైపు ప్రయాణ టికెట్‌ ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంది.


ఈ చార్జీలు చాలవు

ప్రస్తుత చార్జీలు ఎక్కువనిపించినా ద్రవ్యోల్బణపరంగా చూస్తే తక్కువేనని ఇండిగో గ్రూప్‌ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ టెక్నాలజీ కోటియంట్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సంజయ్‌ కుమార్‌ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2003-04లో రూ.4,989గా ఉన్న సగటు విమాన టికెట్‌ చార్జీ 2020 నాటికి రూ.11,000 కావాల్సి ఉందని కాపా తెలిపింది. కొన్ని దేశీ విమానయాన సంస్థలు అర్థాంతరంగా మూతపడటం కూడా చార్జీలు తక్కువగా ఉండటానికి ఒక కారణమని పరిశ్రమ వర్గాల వాదనగా ఉంది.

Updated Date - May 27 , 2024 | 03:05 AM