Share News

Interim Budget 2024: బడ్జెట్‌కు ముందు ఆర్థిక వృద్ధికి 5 సవాళ్లు ఇవే!

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:57 PM

పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కగట్టింది. అయితే వచ్చే ఏడాది అంచనాల మేరకు ఆర్థిక ప్రగతికి పలు సవాళ్లు పొంచివున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ నాగేశ్వరన్ పేర్కొన్నారు.

Interim Budget 2024: బడ్జెట్‌కు ముందు ఆర్థిక వృద్ధికి 5 సవాళ్లు ఇవే!

ధ్యంతర బడ్జెట్ 2024ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ది ఇండియన్ ఎకానమీ: ఏ రివ్యూ' పేరిట మినీ ఎకనామిక్ సర్వేను సోమవారం విడుదల చేసింది. ప్రధాన ఆర్థిక సలహాదారు వీ.అనంత నాగేశ్వరన్ రాసిన 74 పేజీల ఈ రిపోర్టులో పలు కీలక విషయాలు ఉన్నాయి. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతుందని పేర్కొంది. పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం ఖాయమని లెక్కగట్టింది. అయితే వచ్చే ఏడాది అంచనాల మేరకు ఆర్థిక ప్రగతికి పలు సవాళ్లు పొంచివున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆ సవాళ్లు ఏంటో ఒకసారి గమనిద్దాం..

1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న నేటి పరిస్థితుల్లో భారత్ వృద్ధి పథంలో పయనించాలంటే దేశీయంగా పురోగతి సాధిస్తే సరిపోదు. దేశీయంగా ప్రగతిని సాధించడంతో పాటు ప్రపంచ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మినీ ఎకనామిక్ సర్వే పేర్కొంది. గ్లోబలైజేషన్, భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తలు, గ్లోబల్ ఎకానమీలో మందగమనం పరిస్థితులు వృద్ధి రేటుని ప్రభావితం చేయనున్నాయని సీఈఏ నాగేశ్వరన్ పేర్కొన్నారు.

2. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సమర్థవంతమైన ఉద్దీపన చర్యలు అవసరమని ‘మినీ ఎకనామిక్ సర్వే’ పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాల వ్యవధిలో అభివృద్ధి వనరులు సృష్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని సీఈఏ నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు.

3. భారత ఆర్థిక వృద్ధి అంచనాలు ‘డిజిటల్ విప్లవం’పై ఆధారపడిందని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో ఉపాధికి, ప్రత్యేకించి సేవల రంగాలకు సవాళ్లు పొంచివున్నాయని ఎకనామిక్ సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలకు కూడా ఇది ముప్పుగా పరిణమించొచ్చని సీఈఏ నాగేశ్వరన్ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ ఇటీవల ప్రత్యేకంగా పేర్కొందని ప్రస్తావించారు. ప్రపంచ ఉపాధిలో 40 శాతం మంది ఏఐ టెక్నాలజీకి ప్రభావితమవుతారని పేర్కొన్నారు. డిజిటల్ సేవలను ఎగుమతి చేసే దేశాల ఆర్థిక ప్రయోజనాలను ఏఐ దెబ్బతీయవచ్చునని పేర్కొన్నారు. అయితే దుష్ప్రభావాలతో పాటు ప్రయోజనాలు కూడా ఉన్నాయని రిపోర్టులో ఆయన ప్రస్తావించారు.

4. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రతిభ, తగిన నైపుణ్యం ఉన్న శ్రామికశక్తి లభ్యత ఎంతో ముఖ్యమని ఎకనామిక్ సర్వే రిపోర్టులో సీఈఏ నాగేశ్వరన్ పేర్కొన్నారు. శ్రామిక శక్తి ఆర్థిక ఉత్పాదకతను పెంపొందిస్తుందన్నారు. అన్ని స్థాయిల స్కూళ్లలో విద్యార్థులకు తగిన శిక్షణ, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే జనాభాకు విధానపరమైన ప్రాధాన్యతలు అవసరమని చెప్పారు.సవాలు. ఆరోగ్యవంతమైన, విద్యావంతులైన మరియు నైపుణ్యం కలిగిన జనాభా ఆర్థిక వ్యవహారాల శాఖ హైలైట్ చేసింది.

5. అంతర్జాతీయ వాణిజ్యంలో సానుకూల పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. 2023లో గ్లోబల్ ట్రేడ్‌ నెమ్మదించిందని, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడి ఘటనలు కొనసాగుతుండడం ఇందుకు కారణమని ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ఎగుమతి, దిగుమతులు అంత తేలికకాదని నివేదిక పేర్కొంది. ఎర్ర సముద్రం ద్వారా జరుగుతున్న ఎగుమతులపై ఇరాన్ మద్దతున్న హౌతీ మిలిటెంట్ గ్రూపు దాడులు చేస్తున్న నేపథ్యాన్ని నివేదిక ప్రస్తావించింది.

Updated Date - Jan 30 , 2024 | 05:57 PM