Share News

ఆసియా సంపన్న కిరీటం అదానీకే

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:23 AM

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ సంపన్నులను మరింత సంపన్నులను చేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీతో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర ఆస్తుల విలువ 11,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.24 లక్షల కోట్లు) చేరింది. దీంతో...

ఆసియా సంపన్న కిరీటం అదానీకే

కలిసొచ్చిన స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ..

మరోసారి అంబానీని దాటి పైకి.. నికర ఆస్తుల విలువ రూ.9.24 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ సంపన్నులను మరింత సంపన్నులను చేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీతో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర ఆస్తుల విలువ 11,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.24 లక్షల కోట్లు) చేరింది. దీంతో గౌతమ్‌ అదానీ మరోసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని (10,900 కోట్ల డాలర్లు) అధిగమించి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అంతర్జాతీయంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో గౌతమ్‌ అదానీ 11వ స్థానంలో, ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆదివారం వెలువడిన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఈ విషయం తెలిపింది.


రూ.17.51 లక్షల మార్కెట్‌ క్యాప్‌:

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీతో గత వారం అదానీ గ్రూప్‌లోని పది లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ క్యాప్‌ రూ.17.51 లక్షల కోట్లకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధర 14 శాతం వరకు పెరిగి రూ.84,064 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ జోడయింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ ‘జెఫరీస్‌’ బుల్లిష్‌ వైఖరి ప్రకటించడం, వచ్చే పదేళ్లలో ప్రస్తుత వ్యాపారాలు, కొత్త వ్యాపారాలపై 9,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించడదం ఈ ర్యాలీకి బాగా కలిసొచ్చింది. 2022లోనూ అదానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించారు.


హిండెన్‌బర్గ్‌ దెబ్బ నుంచి రికవరీ :

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పెరుగుదల పెద్ద మాయ అని 2023 జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ ప్రకటించింది. దాంతో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ 15,000 కోట్ల డాలర్లు తుడిచి పెట్టుకుపోయింది. ఆ దెబ్బతో గౌతమ్‌ అదానీ ప్రపంచంలోని టాప్‌-20 సంపన్నుల్లో కూడా స్థానం కోల్పోయారు. మళ్లీ ఏడాది తిరగకుండానే అదానీ గ్రూప్‌ షేర్లు ఆ సంక్షోభం నుంచి కోలుకుని ర్యాలీబాట పట్టా యి. దీంతో గౌతమ్‌ అదానీ మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు.

రూ.82,917 కోట్ల స్థూల లాభం : గత ఆర్థిక సంవత్సరం (2023-24) అదానీ గ్రూప్‌ కంపెనీలు రూ.82,917 కోట్ల స్థూల లాభం ఆర్జించాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. అప్పుల భారం తగ్గించుకోవడం, తనఖాలో ఉన్న ప్రమోటర్ల షేర్లను విడిపించుకోవడం, కీలక రంగాల్లో వ్యాపారాన్ని మరింత స్థిరీకరించుకోవడం ద్వారా 2023-24లో స్థూల లాభం గణనీయంగా పెంచుకున్నట్టు అదానీ గ్రూప్‌ తెలిపింది. గత ఐదేళ్లుగా గ్రూప్‌ కంపెనీల స్థూల లాభం ఏటా 54 శాతం చొప్పున పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన స్థూల లాభంలో 84 శాతం కీలక మౌలిక రంగాల కంపెనీల నుంచే వచ్చిందని తెలిపింది. ఫండ్స్‌ ఫ్లో ఆపరేషన్స్‌ కూడా 51 శాతం పెరిగి రూ.56,828 కోట్లకు చేరింది.

Updated Date - Jun 03 , 2024 | 06:23 AM