Share News

‘ఎఫ్‌ఎంసీజీ’కి అదానీ గ్రూప్‌ గుడ్‌బై

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:52 AM

అదానీ గ్రూప్‌.. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి గుడ్‌బై చెబుతోంది. ఇందుకోసం ఎఫ్‌ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌ ఈక్విటీలో తనకు ఉన్న 43.94 శాతం వాటాలో 31.06 శాతం వాటాను....

‘ఎఫ్‌ఎంసీజీ’కి అదానీ గ్రూప్‌ గుడ్‌బై

అదానీ విల్మర్‌లో మొత్తం వాటాల విక్రయం

డీల్‌ విలువ రూ.17,100 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌.. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి గుడ్‌బై చెబుతోంది. ఇందుకోసం ఎఫ్‌ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌ ఈక్విటీలో తనకు ఉన్న 43.94 శాతం వాటాలో 31.06 శాతం వాటాను సింగపూర్‌ కంపెనీ విల్మర్‌ ఇంటర్నేషనల్‌కు విక్రయిస్తోంది. మిగిలిన 12.88 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా సాధారణ వాటాదారులకు విక్రయించనుంది. విల్మర్‌ ఇంటర్నేషనల్‌ ఈ షేర్లను ఒక్కోటి రూ.305 చొప్పున కొనుగోలు చేయనుంది. ఈ అమ్మకం ద్వారా అదానీ గ్రూప్‌నకు రూ.12,314 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా విక్రయించే 12.88 శాతం వాటాను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ లావాదేవీ మొత్తం విలువ రూ.17,100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) తెలిపింది.


ఈ వాటాల కొనుగోలుకు సంబంధించి ఏఈఎల్‌, అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్‌ ఎల్‌ఎల్‌పీ, విల్మర్‌ ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ లెన్సే పీటీఈ లిమిటెడ్‌.. ఈ మేరకు సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

1999 జనవరిలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన అదానీ విల్మర్‌.. ఫార్చూన్‌ బ్రాండ్‌ కింద వంట నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 23 ప్లాంట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.51,55.24 కోట్లుగా ఉంది. కాగా సోమవారం బీఎ్‌సఈలో అదానీ విల్మర్‌ షేరు స్వల్ప నష్టంతో రూ.329.50 వద్ద క్లోజైంది. సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.42,824 కోట్లుగా ఉంది.

Updated Date - Dec 31 , 2024 | 05:52 AM