Share News

జోరు లేని మార్కెట్‌

ABN , Publish Date - May 07 , 2024 | 03:10 AM

భారత షేర్లు అధిక విలువల్లో ట్రేడవుతున్నాయన్న ఆందోళనల కారణంగా దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి దిగడంతో సోమవారం మార్కెట్‌ పరిమిత పరిధిలోనే...

జోరు లేని మార్కెట్‌

17 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: భారత షేర్లు అధిక విలువల్లో ట్రేడవుతున్నాయన్న ఆందోళనల కారణంగా దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి దిగడంతో సోమవారం మార్కెట్‌ పరిమిత పరిధిలోనే కదలాడి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. ఇంట్రాడేలో 74,359.69 నుంచి 73,786.29 పాయింట్ల మధ్యన కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం 33.15 పాయింట్ల నష్టంతో 22,442.70 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ షేర్లలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 5 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలవగా టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఎం అండ్‌ ఎం, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభపడిన షేర్లలో ఉన్నాయి.


9 నుంచి ఎనర్జీ మిషన్‌ మెషనరీస్‌ ఐపీఓ: వచ్చే గురువారం ప్రారంభం కానున్న ఎనర్జీ మిషన్‌ మెషినరీస్‌ ఐపీఓలో షేరు ధర శ్రేణిని రూ.131-138గా నిర్ణయించారు. రూ.41 కోట్ల సమీకరణ లక్ష్యంతో కంపెనీ మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇష్యూ మే 13న ముగుస్తుంది. షేర్లు ఎన్‌ఎ్‌సఈ ఎస్‌ఎంఈ ఎమర్జ్‌లో లిస్టింగ్‌ అవుతాయి. ఇష్యూలో భాగంగా ఒక్కోటి రూ.10 ముఖ విలువ గల 29.82 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేస్తారు.

ఐపీఓకు బ్రెయిన్‌ బీస్‌ తిరిగి దరఖాస్తు: ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ వేదిక ఫస్ట్‌ క్రై మాతృసంస్థ బ్రెయిన్‌ బీస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి తిరిగి దరఖాస్తు చేసింది. కంపెనీ కీలక సమాచారం అసంపూర్తిగా ఇచ్చిన కారణంగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ సెబీ గతంలో చేసిన దరఖాస్తును తిప్పి పంపింది. కొత్తగా చేసిన దరఖాస్తులో కూడా కంపెనీ నిధుల సమీకరణ లక్ష్యంలో ఎలాంటి మార్పు చేయలేదు.


పీ నోట్‌ పెట్టుబడులు ఆరేళ్ల గరిష్ఠం: భారత మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల (పీ నోట్‌) ద్వారా పెట్టుబడులు ఫిబ్రవరి చివరి నాటికి రూ.1,49,517 కోట్లకు చేరాయి. ఇది ఆరేళ్ల గరిష్ఠ స్థాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థలో బలం ఇందుకు మద్దతు ఇచ్చింది. భారత ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులన్నింటినీ ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. జనవరిలో పీ నోట్‌ పెట్టుబడుల విలువ రూ.1,43,011 కోట్లుంది. 2017 జూన్‌ తర్వాత పీ నోట్‌ పెట్టుబడులు ఇంత గరిష్ఠంగా రావడం ఇదే ప్రథమం. ఫిబ్రవరిలో వచ్చిన పీ నోట్‌ పెట్టుబడుల్లో 1.27 లక్షల కోట్లు ఈక్విటీల్లోకి, రూ.21,303 కోట్లు డెట్‌ సెక్యూరిటీల్లోకి, రూ.541 కోట్లు హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లోకి వచ్చాయి.

Updated Date - May 07 , 2024 | 03:10 AM