Share News

అరబిందో ఫార్మా లాభంలో 80% వృద్ధి

ABN , Publish Date - May 26 , 2024 | 05:17 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అరబిందో ఫార్మా అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికాని (క్యూ4)కి గాను కంపెనీ...

అరబిందో ఫార్మా లాభంలో 80% వృద్ధి

క్యూ4 లాభం రూ.909 కోట్లు

2023-24లో ఆదాయం రూ.29,002 కోట్లకు చేరిక

హైదరాబాద్‌: గడచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో అరబిందో ఫార్మా అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికాని (క్యూ4)కి గాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.909 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.506 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా 79.6 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 17.1 శాతం వృద్ధితో రూ.6,473 కోట్ల నుంచి రూ.7,580 కోట్లుగా నమోదైంది. అన్ని వ్యాపార విభాగాల్లో వృద్ధిని నమోదు చేయటం ఎంతగానో కలిసివచ్చిందని అరబిందో ఫార్మా పేర్కొంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.29,002 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3,173 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)లో మొత్తం ఆదాయం రూ.24,855 కోట్లుగా ఉండగా లాభం రూ.1,927 కోట్లుగా ఉంది. కొత్త మార్కెట్లలోకి కార్యకలాపాలు విస్తరించటం సహా కొత్త ఉత్పత్తుల విడుదలతో మార్చి త్రైమాసికంతో పాటు ఆర్థిక సంవత్సరం మొత్తానికి పటిష్ఠమైన పనితీరును కనబరిచినట్లు అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ నిత్యానంద రెడ్డి తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త యూనిట్లు అందుబాటులోకి రావటంతో పాటు నిలకడైన పనితీరుతో ఇదే జోరును కొనసాగించనున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


అమెరికా ఆదాయంలో 22 శాతం వృద్ధి: మార్చి త్రైమాసికంలో అమెరికా ఫార్ములేషన్స్‌ వ్యాపారం 21.6 శాతం వృద్ధి చెంది రూ.2,951 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు చేరుకున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా వ్యాపారం రూ.11,227 కోట్ల నుంచి రూ.13,867 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరోవైపు క్యూ4లో యూరప్‌ వ్యాపారం కూడా 10.4 శాతం వృద్ధి చెంది రూ.1,660 కోట్ల నుంచి రూ.1,832 కోట్లకు పెరిగిందని తెలిపింది. వర్ధమాన మార్కెట్లలో వ్యాపారం ఏకంగా 49.5 శాతం పెరుగుదలతో రూ.570 కోట్ల నుంచి రూ.852 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. యాంటీ రిట్రోవైరల్‌ (ఏఆర్‌వీ) వ్యాపారం కూడా రూ.181 కోట్ల నుంచి రూ.238 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) వ్యాపారం రూ.1,019 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సర మొత్తం వ్యాపారంలో అమెరికా వాటా 47.8 శాతంగా ఉండగా యూరప్‌ వాటా 24.7 శాతంగా ఉంది.


కొత్తగా 11 ఏఎన్‌డీఏలు దాఖలు: మార్చి త్రైమాసికంలో అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ)కి కొత్తగా 11 అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌ (ఏఎన్‌డీఏ) దాఖలు చేసినట్లు అరబిందో వెల్లడించింది. దీంతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎఫ్‌డీఏకి దాఖలు చేసిన ఏఎన్‌డీఏల సంఖ్య 830కి చేరిందని పేర్కొంది.

Updated Date - May 26 , 2024 | 05:17 AM