Share News

వచ్చే ఏడాది వృద్ధి 7%

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:15 AM

భారత్‌లో త్వరలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశాల...

వచ్చే ఏడాది వృద్ధి 7%

  • ద్రవ్యోల్బణం దిగి రావడం ఖాయం

  • 2024-25పై ఆర్‌బీఐ అంచనా

దావోస్‌: భారత్‌లో త్వరలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ధీమా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశాల సందర్భంగా దావో్‌సలో ‘‘గరిష్ఠ వృద్ధి, కనిష్ఠ రిస్క్‌ : భారతదేశ గాథ’’ అనే అంశంపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో దాస్‌ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వ్యవస్థాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ మధ్య కాలిక, దీర్ఘకాలిక వృద్ధిని ఉత్తేజితం చేశాయని చెప్పారు. స్థూలంగా ప్రపంచం పలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అందుకు భిన్నంగా భారతదేశం వృద్ధి, సుస్థిరతల చిత్రాన్ని ఆవిష్కరించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనాగా చెప్పారు. దేశీయంగా డిమాండ్‌ బలంగా ఉండడంతో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నదని, పలు ప్రపంచ పరిణామాల మధ్య భారత్‌ పటిష్ఠంగా నిలిచిందని ఆయన తెలిపారు. విదేశీ మారకం నిల్వలు పుష్కలంగా ఉండడంతో విదేశీ చెల్లింపులకు ఎలాంటి అవరోధం ఉండబోదని దాస్‌ చెప్పారు. 2022 వేసవితో పోల్చితే ద్రవ్యోల్బణం విశేషంగా తగ్గిందని, ద్రవ్య విధాన చర్యలతో పాటు లిక్విడిటీని సద్దుబాటు చేసే చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు ఇది నిదర్శనమని దాస్‌ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 05:19 AM