Share News

ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ల తయారీ

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:34 AM

జపాన్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ తకెడా డెంగ్యూ వ్యాక్సిన్ల (క్యూడెంగా) తయారీని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్‌-ఈ’ (బీఈ)తో వ్యూహాత్మక...

ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ల తయారీ

‘బయోలాజికల్‌-ఈ’తో తకెడా భాగస్వామ్యం

హైదరాబాద్‌: జపాన్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ తకెడా డెంగ్యూ వ్యాక్సిన్ల (క్యూడెంగా) తయారీని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్‌-ఈ’ (బీఈ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బయోఆసియా వేదికగా కుదిరిన ఈ ఒప్పందం కింద బయోలాజికల్‌-ఈ ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్‌ డోసేజీలు తయారుచేస్తుంది. ఒక దశాబ్ది కాలంలో ఏడాదికి 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసేజీలు తయారుచేయాలన్న తకెడా లక్ష్యాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుంది. దీనివల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలకు జాతీయ ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం కింద క్యూడెంగా వ్యాక్సిన్లు తగినన్ని అందుబాటులోకి వస్తాయని తకెడా గ్లోబల్‌ వ్యాక్సిన్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ గ్యారీ డబిన్‌ అన్నారు. వ్యాక్సిన్ల తయారీలో బీఈకి లోతైన నైపుణ్యం ఉన్నదంటూ తమ భాగస్వామ్యం ప్రపంచం నుంచి డెంగ్యూను నిర్మూలించగలదన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. క్యూడెంగా వ్యాక్సిన్ల తయారీలో తకెడాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం గర్వంగా ఉన్నదని బీఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల అన్నారు. ప్రస్తుతం క్యూడెంగా వ్యాక్సిన్లు యూరప్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో పిల్లలకు, పెద్దలకు కూడా ప్రైవేటుగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌లో అనుమతి లేదు.

హైదరాబాద్‌లో మిల్టెనీ బయోటెక్‌ సీఓఈ జర్మనీకి చెందిన బయో మెడికల్‌ ఉత్పత్తులు, సేవల కంపెనీ మిల్టెనీ బయోటెక్‌ హైదరాబాద్‌లో తొలి కార్యాలయాన్ని, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా సీఓఈల్లో ఇదే మొదటిదని కంపెనీ తెలిపింది. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, క్లినికల్‌ నిపుణులు ఈ కేంద్రంలో సెల్‌, జీన్‌ థెరపీల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగలుగుతారని కంపెనీ ఎండీ బోరిస్‌ స్టోఫెల్‌ బయోఆసియా సదస్సు సందర్భంగా ప్రకటించారు. దీనివల్ల ప్రీ క్లినికల్‌/క్లినికల్‌ అభివృద్ధి, వాణిజ్యపరంగా వాటిని అందుబాటులోకి తేవడంపై వారికి అవగాహన ఏర్పడుతుందన్నారు. రోగులకు ఇప్పటివరకు అందుబాటులో లేని వైద్య అవసరాలు తీర్చడానికి వీలుగా కొత్త థెరపీల అభివృద్ధిపై ప్రభుత్వ సహకారాన్ని ఆయన కోరారు.

పరిశోధనలకు నిధులే పెద్ద అవరోధం

ఔషధ అభివృద్ధి రంగంలో పరిశోధనలకు నిధులే పెద్ద అవరోధమని బయో ఆసియా సందర్భంగా ‘‘ఆర్‌ అండ్‌ డీ 2.0: ఇప్పుడు కాకపోతే ఇక ఎన్నటికీ సాధ్యం కాదు’’ అనే అంశంపై జరిగిన గోష్ఠిలో పాల్గొన్న వక్తలన్నారు. ఔషధ పరిశోధనలు అత్యంత ఆసక్తికరమైన, రిస్క్‌తో కూడిన విభాగమని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ అన్నారు. 1990 దశకంలో ఆర్‌ అండ్‌ డీలోకి అడుగుపెట్టిన తాము 2010 నాటికే 15 కోట్ల డాలర్ల వరకు ఆ విభాగంపై ఖర్చు చేశామని తెలిపారు. తాము ఎన్నడూ లాభాల నుంచి ఆర్‌ అండ్‌ డీకి వనరులు ఖర్చు చేయలేదని, అనుబంధ ఆర్‌ అండ్‌ డీ విభాగం సహకార భాగస్వామ్యాల ద్వారా అందుకు నిధులు సమకూర్చుకున్నదని చెప్పారు. ఔషధ పరిశోధనల రంగంలో ప్రభుత్వ సంస్థలు కూడా బలంగా లేవంటూ నిధులు, మౌలిక వసతుల కొరత తీర్చడానికి సహకార భాగస్వామ్యాలే పెద్ద ఆలంబన అని స్పష్టం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 03:34 AM