రాబోయే 20 ఏళ్లలో 4,000 కొత్త విమానాలు కావాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:26 AM
భారత విమానయాన పరిశ్రమకు అపార వృద్ధి అవకాశాలున్నాయని, రాబోయే 20 ఏళ్లలో దేశంలోని విమానయాన సంస్థలకు అదనంగా 4,000 విమానాలు అవసరమని...

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: భారత విమానయాన పరిశ్రమకు అపార వృద్ధి అవకాశాలున్నాయని, రాబోయే 20 ఏళ్లలో దేశంలోని విమానయాన సంస్థలకు అదనంగా 4,000 విమానాలు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అదే కాలంలో దేశంలో కొత్తగా 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం వివిధ విమానయాన సంస్థల వద్ద 800 విమానాలుండగా 1,200 విమానాలకు ఆర్డర్లున్నాయి. గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 157కి చేరింది. రాబోయే ఐదేళ్లలో మరో 50 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. భారత్ ప్రపంచంలోనే త్వరితగతిన వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్ అని.. ఈ రంగ అభివృద్ధితో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయన్నారు.