రూ.400 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 09 , 2024 | 02:11 AM
మన స్టాక్ మార్కెట్ సంపద సోమవారం సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.400.86 లక్షల కోట్లకు (4.81 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది...
సరికొత్త మైలురాయికి స్టాక్ మార్కెట్ సంపద
న్యూఢిల్లీ: మన స్టాక్ మార్కెట్ సంపద సోమవారం సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.400.86 లక్షల కోట్లకు (4.81 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.400 లక్షల కోట్ల మైలురాయిని తాకడం ఇదే తొలిసారి. 2023 జూలై 5న రూ.300 లక్షల కోట్ల స్థాయికి చేరిన బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్.. దాదాపు 9 నెలల్లోనే మరో రూ.100 లక్షల కోట్లు పెరగడం విశేషం. కాగా, గడిచిన ఏడాది కాలంలో మార్కెట్ సంపద రూ.145 లక్షల కోట్లు (57 శాతం) పుంజుకుంది. 2007లో రూ.50 లక్షల కోట్లకు చేరిన బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్.. 2014 మార్చిలో తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. అంటే, రూ.50 లక్షల కోట్ల సంపద వృద్ధికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత ఏడేళ్లలో మరో రూ.100 లక్షల కోట్లు పెరిగి 2021 ఫిబ్రవరిలో రూ.200 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత 30 నెలల్లోనే (రెండున్నరేళ్లు) రూ.200 లక్షల కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) మార్కెట్ విలువ సైతం రూ.400 లక్షల కోట్లకు చేరువలో (రూ.397.76 లక్షల కోట్లు) ఉంది. డాలర్ రూపేణా బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ తొలిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని 2023 నవంబరు 29న చేరుకుంది. అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాత ఈ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించిన ఐదో దేశం భారత్. అంతేకాదు, మార్కెట్ క్యాప్ పరంగా భారత్ ఈమధ్యనే హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. 2021లోనే స్టాక్ మార్కెట్ సంపద మన జీడీపీ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్-జీడీపీ నిష్పత్తి 1.33గా (133 శాతం) ఉంది.
మార్కెట్ క్యాప్ మైలురాళ్లు
సంవత్సరం రూ.లక్షల
కోట్లు
2007 50
2014 మార్చి 100
2021 ఫిబ్రవరి 200
2023 జూలై 300
2024 ఏప్రిల్ 400