ఆరు నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.30,350 కోట్లు
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:54 AM
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) షేర్లు వేటిలోనూ ట్రేడింగ్ చేపట్టరాదని ప్రభుత్వ పెట్టుబడులు, నిర్వహణ శాఖ (దీపమ్) తన అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక అంతర్గత నోట్ జారీ చేసింది,,,
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో మదుపరులు ఈ ఫండ్స్‌లో రూ.30,350 కోట్లు మదుపు చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.2,582 కోట్లు తక్కువని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) తెలిపింది. ఈ ఫండ్స్‌లో ఏదో గూడుపుఠానీ జరుగుతోందని సెబీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. గత ఆరు నెలల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడుల్లో రూ.14,756 కోట్లు మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి, రూ.15,586 కోట్లు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలతో పోలిస్తే 20 నుంచి 24 శాతం అధికంగా పెరిగాయి. దీంతో సెబీ జర జాగ్రత్త అని హెచ్చరించినా, ఇన్వెస్టర్లు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇంకా భారీగానే మదుపు చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో దిద్దుబాటు జరిగితే తప్ప ఈ పెట్టుబడుల జోరుకు బ్రేక్ పడదని భావిస్తున్నారు.
నవంబరు 1న ముహూరత్ ట్రేడింగ్
ఈ సంవత్సరం దీపావళి రోజు జరిగే ‘ముహూరత్’ ట్రేడింగ్ సమయం ఖరారైంది. ఆ రోజు అంటే నవంబరు 1న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ ట్రేడింగ్ జరుగుతుందని స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఆ రోజు నుంచి హిందూ కాలమానం ప్రకారం కొత్త సంవత్సరం ‘సంవత్ 2081’ ప్రారంభం కానుంది. ఆ రోజు జరిగే ముహూరత్ ట్రేడింగ్.. మదుపరులు, బ్రోకర్లకు భోగ, భాగ్యాలు ప్రసాదిస్తుందని మార్కెట్ వర్గాల నమ్మకం. ఏటా దీపావళి రోజు మార్కెట్లకు సెలవైనా, ఆ రోజు సాయంత్రం ఒక గంట సేపు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో లాంఛనప్రాయంగా ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం దీపావళి రోజు సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకు ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఎఫ్ అండ్ ఓ సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ విభాగాల్లో ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది.
పీఎ్‌సయూ షేర్లలో ట్రేడింగ్ వద్దు
అధికారులకు దీపమ్ ఆదేశాలు
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) షేర్లు వేటిలోనూ ట్రేడింగ్ చేపట్టరాదని ప్రభుత్వ పెట్టుబడులు, నిర్వహణ శాఖ (దీపమ్) తన అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక అంతర్గత నోట్ జారీ చేసింది. పీఎ్‌సయూలకు సంబంధించిన కీలక సమాచారం ఈ అధికారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున దీపమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. దీపమ్‌లో చేరే అధికారులు తమ పోర్టుఫోలియోలోని పీఎ్‌సయూ కంపెనీల షేర్ల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని కూడా కోరింది. ఈ కంపెనీల షేర్లను వీరు దీపమ్ ఉన్నతాధికారుల అనుమతి పొందిన తర్వాత మాత్రమే విక్రయించాలని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేసే దీపమ్.. పీఎ్‌సయూల్లో ప్రభుత్వ ఈక్విటీ మూలధన నిర్వహణ, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణను పర్యవేక్షిస్తుంటుంది. ఈ నేపథ్యంలో దీపమ్ ఉన్నతాధికారులు ఈ సర్క్యులర్ జారీ చేయడం విశేషం.