Share News

పునరుత్పాదక ఇంధనంపై రూ.2.30 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:56 AM

పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్‌ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలతో పాటు, అందుకు అవసరమైన సోలార్‌ మాడ్యూల్స్‌, పవన్‌ విద్యుత్‌ జనరేటర్ల తయారీపై..

పునరుత్పాదక ఇంధనంపై రూ.2.30 లక్షల కోట్లు

ఖవ్డా/అహ్మదాబాద్‌ (గుజరాత్‌): పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్‌ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలతో పాటు, అందుకు అవసరమైన సోలార్‌ మాడ్యూల్స్‌, పవన్‌ విద్యుత్‌ జనరేటర్ల తయారీపై 2030 నాటికి రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.2 లక్షల కోట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) ద్వారా ఖర్చు చేయనుంది. ఈ మొత్తంలో రూ.1.5 లక్షల కోట్లు గుజరాత్‌లోని ఖవ్డా వద్ద ఏర్పాటు చేస్తున్న సౌర, పవన్‌ విద్యుత్‌ పార్కు కోసం ఖర్చు చేస్తారు. ఈ పెట్టుబడితో 2030 నాటికి ఈ పార్కులో 30,000 మెగావాట్ల సౌర, పవన్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. మిగతా రూ.50,000 కోట్లతో రాజస్థాన్‌, తమిళనాడుల్లో 6,000-7,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు చేపడతారు. మరో రూ.30,000 కోట్లు అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఏఎన్‌ఐఎల్‌) ద్వారా గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఏర్పాటు చేసే ప్లాంట్లలో సౌలార్‌ సెల్స్‌, విండ్‌ టర్బైన్ల తయారీ కోసం ఖర్చు చేస్తారు.

45,000 మెగావాట్ల లక్ష్యం: అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఇప్పటికే 10,934 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేస్తోంది. 2030 నాటికి 45,000 మెగావాట్ల లక్ష్యం చేరుకోవాలని భావిస్తోంది. ఇందులో 30,000 మెగావాట్లు కేవలం గుజరాత్‌లోని ఖవ్డా వద్ద ఏర్పాటు చేసే సోలార్‌, పవన విద్యుత్‌ పార్క్‌ ద్వారా లభించనుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు. ప్రస్తుతం ఈ పార్కు నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 4,000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది.

Updated Date - Apr 08 , 2024 | 05:56 AM