Share News

ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతనాలు 17% పెంపు

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:01 AM

సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఎల్‌ఐసీ ఉద్యోగుల వేతనాలు 17% పెంపు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి వేతనాలు 17 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2022 ఆగస్టు 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. దీంతో 1.10 లక్షల మందికిపైగా ఎల్‌ఐసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సిబ్బంది జీతాలు 17 శాతం పెంచేందుకు అనుమతించిన కొద్ది రోజులకే..ప్రభుత్వం ఎల్‌ఐసీ ఉద్యోగుల జీతాల పెంపునకు ఆమోదం తెలపడం విశేషం. 2010 ఏప్రిల్‌ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన దాదాపు 24,000 మంది ఎల్‌ఐసీ ఉద్యోగుల ఎన్‌పీఎస్‌ చందాను 10 నుంచి 14 శాతానికి పెంచేందుకూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు వన్‌ టైమ్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకూ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దాదాపు 30,000 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 07:15 AM