Share News

YS Jagan : ఇప్పుడేం చేయాలి!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:16 AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాయపడి, శస్త్ర చికిత్స చేయించుకుని, ఇంటికి కూడా చేరుకున్నాక... 20 రోజులకు ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆయనను పరామర్శించారు.

YS Jagan : ఇప్పుడేం చేయాలి!

బీఆర్‌ఎస్‌ చీఫ్‌తో సీఎం జగన్‌ భేటీ

ఇంటికొచ్చిన 20 రోజులకు ‘పరామర్శ’

అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు

ఆపై... కేటీఆర్‌నూ పంపేసి ఏకాంత చర్చలు

రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం

ఓటమి ఊహించలేదన్న కేసీఆర్‌!

షెడ్యూలు తర్వాతే పరిస్థితి మారింది..

చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్త!

జగన్‌ను అప్రమత్తం చేసిన బీఆర్‌ఎస్‌ చీఫ్‌

వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు

సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు

కాంగ్రె్‌సలో షర్మిల చేరికతో ‘ఇంటి పోరు’

ఇదే సమయంలో కేసీఆర్‌ వద్దకు జగన్‌

(అమరావతి/హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాయపడి, శస్త్ర చికిత్స చేయించుకుని, ఇంటికి కూడా చేరుకున్నాక... 20 రోజులకు ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఏకాంతంగా, ‘ప్రత్యేకం’గా కూడా పరామర్శించారు. సహజంగా ఎవరైనా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే వెళ్లి పలకరించి వస్తారు. కానీ... జగన్‌ ఇన్నాళ్ల తర్వాత వెళ్లడం, అదీ ఏకాంతంగా చర్చలు జరపడం గమనార్హం. ఆరోగ్య పరామర్శతోపాటు రాజకీయ కోణంలోనూ ఈ సమావేశం జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌తో కలసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక విమానంలో గురువారం హైదరాబాద్‌కు వెళ్లారు.

ఉదయం 11.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు అక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ గంటకుపైగా గడిపారు. జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత జగన్‌ను కేసీఆర్‌ వద్దకు తీసుకుని వెళ్లారు. కేసీఆర్‌కు జగన్‌ పుష్పగుచ్ఛం అందించారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్నీ బహూకరించారు. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స, ప్రస్తుత పరిస్థితి, కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది... ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతటితో అసలు పరామర్శ ముగిసింది.

ఏకైక ‘రాజకీయ గురువు’

జాతీయ రాజకీయాల్లో జగన్‌ ఒంటరి! ఏ కూటమిలోనూ ఉండరు. ఎవరితోనూ సన్నిహితంగా మెలగరు. ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్నా అటూఇటూ దిక్కులు చూస్తారే తప్ప ఒక్కరితోనూ మాట కూడా కలపరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయనవి ఫక్తు సొంత అవసరాలే! ‘ఉభయ కుశలోపరి’ తరహాలో కేంద్రంతో ఆయన సంబంధాలు ఉంటాయి. ఇక ఆయనకు ఏకైక సన్నిహితుడు, రాజకీయ గురువు కేసీఆర్‌ ఒక్కరే. వీరిద్దరి రాజకీయ శత్రువు చంద్రబాబు కావడంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా కేసీఆర్‌కు దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం... అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందించారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గెలుపుకోసం జగన్‌ లోపాయికారీగా సహకరించారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కోసం జగన్‌ ఎంతగానో పరితపించారు. కానీ... నిరాశే మిగిలింది. ‘తదుపరి వంతు జగన్‌దే. ఏపీలో ఆయన ఓటమి ఖాయం’ అనే ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడమే కేసీఆర్‌ ఓటమికి కారణమనే సూత్రీకరణ నేపథ్యంలో... జగన్‌ ఇక్కడ సిట్టింగ్‌లను మార్చే పనిలో పడ్డారు. కానీ... ఆయన చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. ఐప్యాక్‌తో సహా ఇతర అన్ని సర్వేల్లో జగన్‌కు ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సిట్టింగ్‌ల మార్పు ప్రక్రియ వికటిస్తోంది. కొందరి విషయంలో బెట్టు వీడి మెట్టు దిగాల్సి వస్తోంది. ‘వారసులకు నో ఛాన్స్‌’ అని చెప్పిన జగన్‌... ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, మహ్మమ్మద్‌ ముస్తాఫా, సుభాష్‌ చంద్రబోస్‌, భూమన కరుణాకర్‌ రెడ్డి వారసులకు టికెట్లు ప్రకటించక తప్పలేదు. ఇప్పుడు కంట్లో నలుసులా .. సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టికెట్లు దక్కని వారు ఎదురు తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. దీంతో రాజకీయంగా జగన్‌కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ‘పాహిమాం’ అంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వద్దకు సలహాల కోసం పరుగులు తీసినట్లు తెలుస్తోంది.

పనిలో పనిగా తల్లి వద్దకు...

కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌ వెళ్లిన జగన్‌... పనిలోపనిగా లోట్‌సపాండ్‌లో ఉన్న తల్లి వద్దకు కూడా వెళ్లారు. షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అక్కడ జగన్‌ అరగంట మాత్రమే ఉన్నారు. సోదరి కాంగ్రె్‌సలో చేరినప్పటికీ... తల్లిని మాత్రం కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవొద్దని జగన్‌ కోరినట్లు తెలుస్తోంది.

ఏకాంతంగా చర్చించి...

పరామర్శ తర్వాత కేటీఆర్‌ సహా అందరినీ బయటికి పంపించారు. కేసీఆర్‌తో జగన్‌ కొద్దిసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడి, వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడంపై కేసీఆర్‌ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమిని ఊహించలేదని కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేదాకా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదని... ఆ తర్వాతే పరిస్థితి మారిందని చెప్పినట్లు సమాచారం. ‘‘అంతా బాగుందనుకున్నాం. కానీ... ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక 40 రోజుల్లో మార్పు కనిపించింది. ఇది ఊహించని పరిణామం’’ అని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతోపాటు... ‘అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు తమ వ్యతిరేకతను ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకు బయట పెట్టరు.. జాగ్రత్త’ అని జగన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 05 , 2024 | 04:17 AM