Share News

మీ ఓటు మీ ఇష్టం : కలెక్టర్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:14 AM

మీ ఓటు మీ ఇష్టమని, ఇష్టమైన వారికి శాంతియుత వాతావరణంలో వేసుకోవచ్చని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అన్నారు.

మీ ఓటు మీ ఇష్టం : కలెక్టర్‌
రచ్చుమర్రి గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ జి. సృజన

సమస్యాత్మక ప్రాంతాల్లో కలెక్టర్‌, ఎస్పీ పర్యటన

మంత్రాలయం, మార్చి 21: మీ ఓటు మీ ఇష్టమని, ఇష్టమైన వారికి శాంతియుత వాతావరణంలో వేసుకోవచ్చని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అన్నారు. మండలంలోని అత్యంత సమస్యాత్మక కేంద్రమైన రచ్చుమర్రి గ్రామంలోని 57, 58 పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, ఎస్పీ జి.కృష్ణకాంత్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం గ్రామానికి వెళ్లి పోలింగ్‌ కేంద్రాల్లోని అన్ని ఏర్పాట్లను పరిశలించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓటర్లతో వారు మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని గ్రామస్థులను సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు, అల్లర్లకు పాల్పడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులకు సహకరించాలన్నారు. వీరి వెంట మంత్రాలయం ఆర్వో మురళి, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, డీటీ రాఘవేంద్ర, సరస్వతి, ఆర్‌ఐ ఆదామ్‌, మహేష్‌, ఆనంద్‌, నరసప్ప, కోసిగి సీఐ ప్రసాద్‌, మాధవరం ఎస్‌ఐ క్రిష్ణమూర్తిలు ఉన్నారు.

వాల్మీకి నగర్‌లో గ్రామస్థులకు అవగాహన

ఆదోని : ఆదోని మండల కేంద్రం వాల్మీకి నగర్‌లోని జీ విశ్వేశ్వర పాఠశాల కపటి గ్రామంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్ర ఆవరణలో ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్‌ డాక్టర్‌ జీ సృజన గ్రామసభ నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం మనం నిర్వహిస్తున్నప్పుడు మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు పడకుండా మీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, డీఎస్పీ శివనారాయణ స్వామి, తహసీల్దార్‌ హసీనా సుల్తానా పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వాహణపై అవగాహన సదస్సు

పట్టణంలోని రెడ్డీస్‌ హాస్టల్లో సాధారణ ఎన్నికలు 2024 నిర్వాహణ పై బూత్‌ లెవెల్‌ స్థాయి అఽధికారులకు, సెక్టోరియల్‌ అధికారులకు, ఎంసీసీ బృందాలకు కలెక్టర్‌ డాక్టర్‌ జీ సృజన, ఎస్సీ జీ కృష్ణకాంత్‌ అవగాహన సదస్స నిర్వహించారు. అధికారులు చేపట్టాల్సిన విధి, విధానాల పై వారు సూచనలు చేశారు. ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా తావివ్వకూడదని సూచించారు.

కపటిలో ఎస్పీ, కలెక్టర్‌ పర్యటన

ఆదోని రూరల్‌ : ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఆదోని మండలంలో కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, జి. ఎస్పీ కృష్ణకాంత్‌ సూడిగాలి పర్యటన చేశారు. రూరల్‌ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన కపటి లో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. మీకు ఇష్టమైన వారికి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, అల్లర్లకు పాల్పడినా, సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:14 AM