Share News

మీ బలప్రదర్శన మా ముందొద్దు!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:33 AM

‘మీ బల ప్రదర్శనలు మా ముందు వద్దు’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. వందల కార్లలో, వేల మంది అభిమానులతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయనను ‘ఒంటరి’గా రావాలంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. దీంతో అన్నీ సిద్ధం చేసుకుని,

మీ బలప్రదర్శన మా ముందొద్దు!

ఆదిలోనే ముద్రగడకు మరో అవమానం

భారీగా జనాలు వస్తే సీఎం భద్రతకు ఇబ్బందులంటూ కాపు నేతకు సమాచారం

తానొక్కడినే వెళ్లి నేడు వైసీపీలో చేరాలని నిర్ణయం

కాకినాడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘మీ బల ప్రదర్శనలు మా ముందు వద్దు’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. వందల కార్లలో, వేల మంది అభిమానులతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయనను ‘ఒంటరి’గా రావాలంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. దీంతో అన్నీ సిద్ధం చేసుకుని, ఎంతోమందిని ఆహ్వానించి అట్టహాసంగా కిర్లంపూడి నుంచి గురువారం ఉదయం తాడేపల్లికి బయలుదేరాలని భావించిన ముద్రగడ జావగారిపోయారు. తనను క్షమించాలంటూ అభిమానులకు ఆయన లేఖ రాసి, తాను ఒక్కడినే వెళ్లి పార్టీ కండువా కప్పుకొంటానని పేర్కొన్నారు. ఏం జరిగిందంటే...గురువారం తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో చేరడానికి రావాలని ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ అధిష్ఠానం ఆహ్వానించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని స్వగృహం నుంచి తాడేపల్లికి బయలుదేరడానికి ముద్రగడ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీలో చేరుతున్న తన వెంట ప్రయాణించడానికి అందరూ రావాలని పిలుపునివ్వడంతో పలువురు అనుచరులు పదుల సంఖ్యలో కార్లు అద్దెకు తీసుకున్నారు. ఈలోపు ముద్రగడ గురువారం అందరూ షాక్‌ అయ్యేలా మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తే సీఎం జగన్‌కు భద్రతా పరమైన ఇబ్బంది తలెత్తే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. దీంతో తాడేపల్లికి అంతా తరలివెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నిరుత్సాహపర్చినందుకు క్షమాపణ కోరుతున్నట్లు వివరించారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో తానొక్కడే వెళ్లి వైసీపీలో చేరుతానన్నారు. అయితే, జగన్‌ ఎదుట భారీ బల ప్రదర్శనకు ముద్రగడ సిద్ధం కావడం ఆయనకు నచ్చకే భద్రతా కారణాలను సాకుగా చూపించినట్లు ముద్రగడ అనుచరులు భావిస్తున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 09:26 AM