ఏళ్లతరబడి ఎదురుచూపులు
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:41 PM
: రాయలసీమ ప్రాజెక్టులపై పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు.
మిడ్తూరు ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చేనా?
కేసీ నీటి వాటా వచ్చేనా?
20 ఏళ్లుగా అసంపూర్తిగా హంద్రీ-నీవా
నేడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాక
నంద్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి)/ నందికొట్కూరు: రాయలసీమ ప్రాజెక్టులపై పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అంతులేని నిర్లక్ష్యం సీమ జలాశయాలకు శాపంగా మారింది. కొద్దిపాటి నిధులిస్తే వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు శూన్యం. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, హంద్రీనీవా విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఆర్భాటంగా ప్రారంభించిన రాయలసీమ దుర్భిక్షం మిషన కింద చేపట్టిన కాలువల విస్తరణకు నిధులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కరువు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. హంద్రీనీవా ప్రాజెక్టు సహా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల దృష్టి సారించాలని, నిధులు ఇచ్చి కరువు రైతుల క‘న్నీటి’ కష్టాలు తీర్చాలని సీమ సాగునీటి నిపుణులు కోరుతున్నారు.
రాయలసీమ ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంగా హందీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం జలాశయం ఎగువన ప్రధాన లిఫ్టు మల్యాల పంప్‌హౌస్ నుంచి 40 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఫేజ్-1 కింద నంద్యాల జిల్లా మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 3,850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 9.5 మీటర్లు బెడ్ విడ్త్ (కాలువ అడుగు బాగం వెడల్పు)తో 216.30 కి.మీలు ప్రధాన కాలువ, కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ (పందికోన), అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్లు, 8 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. నేడు 1,940 క్యూసెక్కులు కూడా ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 7.5 టీఎంసీలు వినియోగించుకొని 80 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా 15-25 వేల ఎకరాలకు కూడా ఇవ్వడం లేదు.
ఫ ప్రశ్నార్థకంగా కేసీ వాటా..?
కర్నూలు టూ కడపకు నీరందించే కేసీ కాలువకు కింద ఉమ్మడి జిల్లాలో దాదాపు 2.65 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కాలువకు 15 టీఎంసీల వాటా ఉండగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు 5 టీఎంసీల నీటిని అనంతపురానికి తరలించాడు. అయితే జగన హయాంలో ఆ 10 టీఎంసీల నీటీని కూడా కేసీ కెనాల్‌కు తరలించటంలో నిర్లక్ష్యం వహించాడు. కేసీ కాలువ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలు ఉండగా, గతేడాది ఖరీఫ్ సీజనలో 3,600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించినట్లు అధికారి లెక్కలు చెబుతున్నాయి. కేసీ కాలువ ఆయకట్టు కింద ఉన్నా నీరు అందకపోవటంతో నందికొట్కూరు నియోజకవర్గ రైతులు వైసీపీ హయాంలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవటం గమనార్హం. కాలువ కింది రైతులు ఆరతడి పంటలు పండించడాన్ని బట్టి చూస్తే గత వైసీపీ ప్రభుత్వ పనితీరు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఇక టీడీపీ హయాంలో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నియోజవర్గ ప్రజల కష్టాలను కొంతలో కొంత తీర్చగలిగింది. ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల పథకం విషయంలోనూ వైసీపీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ పథకాల నిర్వహణకు సంబంధించి నిధులు, కరెంటు బిల్లులు చెల్లించకుండా సతాయించింది. దీంతో నియోజకవర్గంలో మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా సకాలంలో నీరు విడుదల కాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సక్రమంగా వ్యవహరిస్తే నియోజకవర్గ సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి.
ఫ అటకెక్కిన అలగనూరు..
తుంగభద్ర నుంచి నీరు అందని పరిస్థితుల్లో కుందూలోనికి నీరు వదిలి, ఆ నీటికి కేసీకి మళ్లించేందుకు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించారు. అయితే నిర్మాణ లోపం వల్ల బండ్ మొత్తం కుంగిపోయింది. వైసీపీ హయాంలో బండ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు 2021లో అధికారులు రూ.3.12 కోట్లతో ప్రతిపాదనలు పంపంచారు. ఆ తర్వాత నిపుణుల కమిటీ పరిశీలించి రిజర్వాయర్ మొత్తం మీద అర కిలోమీటరు మేర బండ్ కుంగిపోయిందని, ఈ మేర మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో అధికారులు మళ్లీ రూ.22 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. పెరిగిన అంచనా వ్యయాలకు అనుగుణంగా ఆ మొత్తం సరిపోదంటూ ప్రతిపాదనలకు సవరణ చేసి రూ.26.33 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. ఇలా అధికారులు మూడుసార్లు ప్రతిపాదనలు పంపించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు గానీ, నిధులు కేటాయించిన దాఖలాలు గానీ లేవు. దీంతో రిజర్వాయర్ పూర్తిగా వట్టిపోవటంతో కేసీకి నీరు సరిగా అందకపోవటమే కాకుండా, భూగర్భజలాలు కూడా అడుగంటిపోతున్నాయి. నేడు మాల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న తరుణంలో ఇక్కడి సాగునీటి ఇబ్బందులను అధిష్టానానికి వివరించి, వాటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ, జిల్లా రైతాంగం కోరుతోంది.
ఫ ఏళ్ల నాటి కల:
నందికొట్కూరు నియోజకవర్గంలో సాగునీటి కాలువలేని ఒకే ఒక్క మండలం మిడ్తూరు. వర్షాధారితంపై ఆధారపటి పంటలు పండిస్తారు. వర్షాలు తక్కువైతే పంటలు ఎండిపోవాల్సిందే. ఈ మండలానికి సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే రైతాంగం ఇబ్బందులు తొలగిపోతాయి. మిడ్తూరు మండలంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు హామీలు ఇవ్వటం తప్పించి వారి గోడును పట్టించుకున్న వారు లేరు. ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేశ సమక్షంలో టీడీపీ నాయకులు తమ పార్టీ అధికారంలోనికి వస్తే మిడ్తూరు ఎత్తి పోతల పథకాన్ని ఏర్పాటు చేయిస్తానని, లేకపోతే తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయిస్తానని టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి మిడ్తూరు ప్రజలకు హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు చెప్పిన విధంగా ఎత్తిపోతల ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని ఈ మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఫ వెలు‘గోడు’ వినేదెవరు..?:
తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 16.95 టీఎంసీల సామర్థ్యంతో వెలుగోడు జలాశయం నిర్మించారు. ఆనకట్ట 11.64 కి.మీటర్లు పొడవు, 28 మీటర్లు, ఎత్తు, 6 మీటర్లు పైభాగం వెడల్పుతో నిర్మించిన ఆసియాలోనే అతి పొడవైన మట్టి ఆనకట్ట జలాశయం ఇది. లోపలి భాగంలో వెదర్ రాక్ రిబిట్మెంట్ (రాతిపరుపు) బండ్ పొడవున అక్కడక్కడ వెయ్యి మీటర్లకు పైగా రిబిట్మెంట్ కుంగిపోయి ప్యాచెస్‌లు ఏర్పడ్డాయని ఇంజనీర్లు గుర్తించారు. గత టీడీపీ ప్రభుత్వంలో డ్యాం రిహ్యాబిలిటేషన అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)-2 కింద రూ.99 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు రాలేదు. కుంగిన రాతిపరుపు మరమ్మతులు, ఎర్త్‌డ్యాం బండ్ 11.64 కిలోమీటర్లు బలోపేతం, బయటి వైపున మట్టికట్ట కోతకు గురికాకుండా గ్రాస్ పెంపకం, స్పిల్‌వే గేట్ల మరమ్మతులు కోసం రూ.150-155 కోట్లు కావాలని డ్రిప్-3 కింద మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
ఫ శ్రీశైలం మరమ్మతులకు రూ.205 కోట్లు కావాలి:
శ్రీశైలం ప్రాజెక్టు ఆనకట్ట స్పిల్‌వే గేట్ల దిగువన ప్లంజ్‌పూల్ ప్రాంతంలో 45 మీటర్లు లోతు, 270 మీటర్లు వెడల్పు, 400 మీటర్లు పొడవుతో భారీ గుంత ఏర్పడింది. ప్ల్లంజ్‌పూల్ వల్ల డ్యాం భద్రతకు, ప్రాజెక్టు రెండు వైపుల ఉన్న గట్లు, ఆనకట్ట పునాదిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. ప్లంజ్‌పూల్ అధ్యనం కోసం రూ.17 కోట్లు, డ్యాం శాశ్వత మరమ్మతులపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు డాక్టరు హ్యానిశశాలం, అభిషేక్‌కుమార్‌ల సూచనల మేరకు ‘డ్యాం రిహాబిలిటేషన అండ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం’ (డ్రిప్)-2 కింద రూ.203 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయినా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.