Share News

హైకోర్టుకు వైసీపీ రెబల్స్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:21 AM

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ చీఫ్‌ విప్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు

హైకోర్టుకు వైసీపీ రెబల్స్‌

కౌంటర్‌కు స్పీకర్‌ సమయం ఇవ్వలేదు

తదుపరి చర్యల నిలుపుదలకు వినతి

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు

ఇవ్వలేమన్న ధర్మాసనం

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ చీఫ్‌ విప్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు స్పీకర్‌ తమకు సమ యం ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఆక్షేపించారు. స్పీకర్‌ అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. కౌంటర్‌ వేయాలని లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి, అసెంబ్లీ చీఫ్‌విప్‌ ప్రసాదరాజులకు నోటీసులు జారీచేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమంది. విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పిటిషన్‌తో చీఫ్‌ విప్‌ జత చేసిన పత్రికా కథనాలను, యూట్యూబ్‌ లింక్‌ల వివరాలు అందజే యాలని, కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్లు స్పీకర్‌ను కోర గా నిరాకరించారని తెలిపారు.

దస్త్రాలు ఇవ్వకుండా కౌంటర్‌ వేయడం సాధ్యపడదన్నారు. చీఫ్‌విప్‌ జత చేసిన అన్ని దస్త్రాలను పిటిషనర్లకు అందజేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖర్‌ వాదనలు వినిపిస్తూ... స్పీకర్‌కు క్వాషీ జ్యుడీషియల్‌ అధికారాలు ఉన్నాయన్నారు. అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ తుది నిర్ణయం వెల్లడించిన తరువాతే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించాలని, ప్రాథమిక దశలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. దీంతో వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. మరోవైపు తాను వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వకుండా అనర్హత పిటిషన్‌పై శాసనమండలి చైర్మన్‌ విచారణ జరపడాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపైనా విచారణ జరిపిన జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Jan 30 , 2024 | 06:45 AM