Share News

AP Politics: వైసీపీలో రచ్చ రచ్చ.. బైరెడ్డి పెద్ద ప్లానేశారే..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:56 AM

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ టికెట్‌, కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం, మచిలీపట్నం ఎంపీ సీటు వ్యవహారం రసకందాయంలో పడింది.

AP Politics: వైసీపీలో రచ్చ రచ్చ.. బైరెడ్డి పెద్ద ప్లానేశారే..!

టికెట్ల కాకతో తిరుగు‘పోట్లు’.. జగన్‌ అండ్‌ కో బుజ్జగింపులు

సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు సీఎం జగన్మోహన్‌రెడ్డికి, వైసీపీ పెద్దలకు ఎక్కడా లేని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సర్వేల బూచి చూపి పోటీ నుంచి తప్పించాలన్న ఎత్తుగడలు ఫలించడం లేదు. స్వచ్ఛందంగా ఎన్నికల నుంచి వైదొలిగేందుకు పలువురు ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. అసంతుష్ట నేతలను బుజ్జగించడానికి సోమవారం జగన్‌ అండ్‌ కో శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైంది.

  • నరసరావుపేట, పెనమలూరుపై

  • ఎడతెగని పంచాయితీ

  • సీఎం చెప్పినా గోపిరెడ్డిని ఓడిస్తాం

  • నరసరావుపేటలో బ్రహ్మారెడ్డి వర్గం వార్నింగ్‌

  • విజయసాయిరెడ్డి రాజీ యత్నాలు విఫలం

  • మచిలీపట్నం ఎంపీగా పోటీచేయాలని

  • కొలుసు పార్థసారథిపై ఒత్తిడి

  • ససేమిరా అన్న పెనమలూరు ఎమ్మెల్యే

  • టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారంతో వణుకు

  • మరో ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేల మార్పు

  • నందిగామలో మహిళకు అవకాశం?

  • గూడూరు, పామర్రు ఎమ్మెల్యేలకు,

  • దేవదాయ మంత్రి కొట్టుకు మొండిచేయి?

  • నందికొట్కూరుకు లబ్బి వెంకటస్వామి?

  • వెలంపల్లిని మళ్లీ మార్చే యోచన

  • పలువురు సిట్టింగ్‌లకు ‘ప్యాలెస్‌’ పిలుపు

  • అధిష్ఠానం తీరుపై పలువురి ఆక్రోశం

  • ఎస్సీ స్థానాలపై చిన్న చూపు

  • చూస్తున్నారని ఎమ్మెల్యే పద్మావతి ధ్వజం

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ టికెట్‌, కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం, మచిలీపట్నం ఎంపీ సీటు వ్యవహారం రసకందాయంలో పడింది. నరసరావుపేటలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే సీఎం టికెట్‌ ఖరారు చేయడంతో ఆయన ప్రత్యర్థి గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం కస్సుమంది. జగన్‌ స్వయంగా చెప్పినా గోపిరెడ్డిని ఓడించి తీరతామని హెచ్చరిస్తోంది. పెనమలూరు నుంచి మచిలీపట్నం లోక్‌సభకు పోటీచేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా ససేమిరా అన్నారు. ఆయనతోపాటు పామర్రు, అవనిగడ్డ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తుండడంతో సర్వేల పేరు చెప్పి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు తాడేపల్లిలో ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ప్యాలె్‌సకు పిలిపిస్తున్నారు. మీరు ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయి.. సీటు ఇవ్వలేకపోతున్నాం.. వేరే విధంగా న్యాయం చేస్తాం.. ఈ నియోజకవర్గంలో అయితే మీరు గెలవలేరు.. మిమ్మల్ని మరో చోటకు పంపుతున్నాం.. అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మాటామంతీ అంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో కీలక అధికారి ధనుంజయరెడ్డి చేస్తున్నారు. నరసరావుపేటలో సిటింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దని బ్రహ్మారెడ్డి వర్గం చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఇటీవల తనకే అవకాశమివ్వాలని బ్రహ్మారెడ్డి బహిరంగంగానే గళమెత్తారు. దీనిపై సోమవారం విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఆయన వర్గంతో చర్చించారు. రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘సీఎం గారు చెప్పారు.. తప్పనిసరిగా మద్దతివ్వాల్సిందే. అందరూ కలిసి గోపిరెడ్డిని గెలిపించాలి’ అని సాయిరెడ్డి గట్టిగా చెప్పగా.. ఆ ప్రసక్తే లేదం టూ బ్రహ్మారెడ్డి వర్గం తేల్చేసింది. తమ నేత బ్రహ్మారెడ్డికి టికెట్‌ ఇవ్వకపోతే కచ్చితం గా గోపిరెడ్డిని ఓడిస్తామంటూ ఆ వర్గం నాయకులు సమావేశ ం నుంచి వెళ్లిపోయా రు. అంతకు ముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారు ధర్నా కూడా చేశారు.

పార్థసారథి వద్దకు రాయబారం!

వైసీపీ రెండో జాబితా విడుదలయ్యాక ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైంది. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కూడా మొండిచేయి ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగడంతో.. ఆయన బహిరంగంగానే నిరసన తెలిపారు. దురదృష్టవశాత్తూ తనను సీఎం జగన్‌ గుర్తించడం లేదని.. ఆయన టికెట్‌ ఇచ్చినా ఇవ్వకున్నా పెనమలూరు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం ఊపందుకోవడంతో.. ‘ఉంటే ఉండండి.. పోతే పొండి’ అన్న జగన్‌ ఉలిక్కిపడ్డారు. ఆయన్ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాడేపల్లి రమ్మన్నా రాలేదు. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎంపీ అయోధ్యరామిరెడ్డి నేరుగా పోరంకిలోని పార్థసారథి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు. సీఎం కార్యాలయానికి రమ్మని పిలిచారు. అందుకాయన తిరస్కరించడంతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిని జగన్‌ రాయబారానికి పంపారు. ఇది కొంత ఫలించింది. వారిద్దరితో కలిసి పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో సమావేశమయ్యారు. వారికి టికెట్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్‌ వివరించారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్థసారథికి సూచించారు. ఆయన అంగీకరించలేదు. తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. దీంతో పార్థసారథిని మళ్లీ అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌ వద్దకు పంపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన్ను ఎంపీగా గెలిపించేందుకు పూర్తిగా సహకరిస్తారని వారిద్దరూ హామీ ఇచ్చినా పార్థసారథి ససేమిరా అన్నారు.

ఎమ్మెల్యేల ఆక్రోశం..

సీటు గల్లంతైన, మారిన వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం సీఎంవోలో పంచాయితీ పెట్టే పరిస్థితికి వచ్చిందని వాపోయారు. తనను కాదని వరుపుల సుబ్బారావును ఇన్‌చార్జ్‌గా నియమించడంపై ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ఇన్‌చార్జిని మార్చినా గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇస్తారని, ఐదేళ్లుగా నిబద్ధతతో పనిచేసిన తనకే సీఎం జగన్‌ టికెట్‌ ఇస్తారని ఆయన నమ్ముతున్నారు. ప్రజాదీవెన పేరుతో ఈ నెల 12 నుంచి జనంలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.

మార్కాపురం నేతలతో జగన్‌ భేటీ..

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వం మార్పుపై ఆయనతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిని పిలిపించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇద్దరితో చర్చించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మార్పుపై ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డితో సీఎం చర్చించారు. ఇక జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టమైపోయిందని ఇటీవల బహిరంగంగా మాట్లాడిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కూడా సోమవారం తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద పడిగాపులు గాచినా ముఖ్యమంత్రి దర్శనం దొరకలేదు.

తాడేపల్లికి నేతల క్యూ..

పెద్దల పిలుపుతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎలీజా (చింతలపూడి), శ్రీనివాసులు (చిత్తూరు), నాగార్జునరెడ్డి (మార్కాపురం), మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌.. ఎంపీలు నందిగం సురేశ్‌, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు సోమవారం తాడేపల్లికి క్యూ కట్టారు. గూడూరు (ఎస్సీ) ఎమ్మెల్యే వరప్రసాద్‌, నందిగామ (ఎస్సీ) ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, పామర్రు (ఎస్సీ) ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్‌కు ఈ దఫా అవకాశమిచ్చేది లేదని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. నందిగామ టికెట్‌ను ఓ మహిళకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇప్పటికే విజయవాడ వెస్ట్‌ నుంచి సెంట్రల్‌ నియోజకవర్గానికి మార్చారు. దీనిపై పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరితే ఆయన కుమార్తెకు వెస్ట్‌ సీటు కేటాయించాల్సి ఉంటుందని.. దీంతో వెలంపల్లిని ఇక్కడ నుంచి కూడా మార్చాలని నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి మార్పుపై దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణతో సజ్జల, ధనుంజయరెడ్డి చర్చించినట్లు తెలిసింది.

byreddy-cm-jgan.jpg

ఆర్థర్‌కు టికెట్‌ ఇవ్వొద్దన్న బైరెడ్డి..

వైసీపీలో తాజాగా మరో ఎస్సీ ఎమ్మెల్యే టార్గెట్‌ అయ్యారు. రిజర్వుడు నియోజకవర్గమైన నందికొట్కూరుపై పెత్తనం చేస్తున్న శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్‌కు టికెట్‌ ఇవ్వొద్దని పట్టుబడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా అక్కడ ఆధిపత్యం చలాయిస్తూ ఆర్థర్‌ను ఆయన నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన్ను మార్చాలంటూ తాడేపల్లిలో బైరెడ్డి వర్గం తిష్ఠవేసింది. లబ్బి వెంకటస్వామికి నందికొట్కూరు, తనకు శ్రీశైలం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని సిద్ధార్థరెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఎక్కువ మంది ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఆచితూచి వ్యవహరించాలని వైసీపీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని పిలిపించి మాట్లాడారు.

Updated Date - Jan 09 , 2024 | 07:10 AM