Share News

కోడ్‌ కూయకముందే కోట్లు పంచుడు

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:38 AM

‘మీ బిడ్డ వల్ల మంచి జరిగిందని భావిస్తే మాకే ఓటు వేయండి’... అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మైకు పట్టుకుని హోరెత్తిస్తున్నారు. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన వైసీపీ నేతలు మాత్రం ఓటర్లను ‘మంచి’ చేసుకునేందుకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌

కోడ్‌ కూయకముందే కోట్లు పంచుడు

ఓటర్లకు వైసీపీ నేతల తాయిలాలు

రాష్ట్రమంతా రకరకాల కానుకల పంపిణీ

మహిళలకు చీర, జాకెట్‌.. మగవారికి మందు

బిర్యానీ, 500 నోటు, ఇతర కానుకలు కామన్‌

వలంటీర్లతో ‘ఆత్మీయ’ సమావేశాల ఏర్పాటు

మొబైల్‌ ఫోన్లు, కుక్కర్లు, నగదు పంపిణీ

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రలోభాలు

బహిరంగంగా పంచుతున్నా పట్టించుకోని ఈసీ

కోడ్‌ వస్తే తప్ప ‘కోరలు’ రావా?

నాలుగున్నరేళ్లుగా ప్రజలను, ప్రజా సమస్యలనూ అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ‘గడప గడప’లో తీవ్ర నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. ఇప్పుడు కానుకలు పంచి ఓట్లు వేయించుకోవాలని వ్యూహం పన్నారు.

మహిళలకైతే చీర, జాకెట్‌, ఇతర కానుకలు! మగవారికైతే మందు ప్రత్యేకం. ఇక స్వీట్లు, బిర్యానీ, డబ్బు. విలేకరులు, వలంటీర్లకైతే మరింత స్పెషల్‌. వైసీపీ నేతలు కానుకల పేరిట ఒక్కో నియోజకవర్గంలో కోట్లు ఖర్చు చేస్తున్నారు.

వైసీపీ నేతలు వలంటీర్లతో ప్రత్యేక ‘ఆత్మీయ’ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి పరిధిలోని ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ‘ఇప్పుడు ఐదు వేలు తీసుకోండి, తర్వాత మరో పదివేలు ఇస్తాం’ అని వలంటీర్లపై వల విసురుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మీ బిడ్డ వల్ల మంచి జరిగిందని భావిస్తే మాకే ఓటు వేయండి’... అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మైకు పట్టుకుని హోరెత్తిస్తున్నారు. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన వైసీపీ నేతలు మాత్రం ఓటర్లను ‘మంచి’ చేసుకునేందుకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ రాలేదు. కోడ్‌ అమల్లోకి రాలేదు. అసలు నామినేషన్లే వేయలేదు. అధికార వైసీపీ నేతలు ఇప్పటి నుంచే ఓట్ల కోసం తాయిలాలు ఎర వేస్తున్నారు. షెడ్యూలు విడుదలకు ముందే రాష్ట్రమంతా ఓ దఫా కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం.. సర్వేల్లో ప్రతికూల ఫలితా లు వస్తుండటంతో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటి నుంచే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లడంతో పాటు విందులు, సమావేశాల పేరిట కానుకలు పంపిణీ చేస్తున్నారు. చీరలు, జాకెట్లు, స్వీట్లు, బిర్యానీ, మందు, డబ్బులు.. ఇలా రకరకాల కానుకలు బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. కానుకలను బాక్సుల్లో పెట్టి అందజేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆశావహులు.. ఈ నెలలో గ్రామాల్లో విందులు, సహ పంక్తి భోజనాల పేరిట తాయులాల పంపిణీకి తెరలేపారు. వేడి వేడి బిర్యానీ వడ్డిస్తున్నారు. భోజనాలు అయిపోయాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త.. వచ్చిన వారికి రిటర్న్‌ గిఫ్ట్‌గా మహిళలకు చీర, జాకెట్‌ ఇస్తున్నారు. వీటితో పాటు ఒక్కొక్కరికి రూ.500 నోటు ఇస్తున్నారు. మగవారికి బిర్యానీతో పాటు మందు బాటిల్‌, అక్కడక్కడా డబ్బులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ ‘బాసలు’ కూడా చేయిస్తున్నారు. ‘ఇది మొదటి విడత మాత్రమే! ఎన్నికల ముందు మరోసారి డబ్బులు పంపిణీ చేస్తాం’ అని కూడా చెబుతున్నారు.

వలంటీర్లకూ వల

ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవల ఆదేశించింది. వారిని పోల్‌ ఏజెంట్లుగా కూడా నియమించవద్దని స్పష్టం చేసింది. అయినా సరే... వలంటీర్లను ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వాడుకోవడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. వారికి ప్రత్యేక తాయిలాలు అందిస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘మిమ్మల్నే నమ్ముకున్నాం. మీరే గెలిపించాలి’ అని వేడుకుంటున్నారు. చివర్లో... కుక్కర్లు, దుస్తులను సంచుల్లో పెట్టి ఇస్తున్నారు. ఒక్కో చోట రూ.5వేల దాకా నగదును అందిస్తున్నారు. మంగళవారం మంత్రి దాడిశెట్టి రాజా వలంటీర్లకు ఏకంగా సెల్‌ఫోన్లు అందించడం గమనార్హం. ఇక... విలేకరులపైనా ఇదే స్థాయిలో వల విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలుత ఐ-ప్యాక్‌ టీమ్‌ ద్వారా విలేకరులకు గిఫ్ట్‌ కిట్‌లు అందించారు. ఇప్పుడు వైసీపీ నేతలే రకరకాల కానుకలు ఇస్తున్నారు.

ఈసీ ఏం చేస్తున్నట్లు?

‘సరిహద్దు రాష్ట్రాల నుంచి డబ్బులు, మద్యం రాకుండా చూడండి. తనిఖీలు చేయండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అదంతా సరేగానీ... ఎక్కడికక్కడ వైసీపీ నేతల పందేరాల సంగతేమిటి? బహిరంగంగా సాగుతున్న ప్రలోభాలు ఈసీ, పోలీసుల దృష్టికి రాలేదా? అంటే... అన్నీ తెలిసీ కళ్లు మూసుకున్నారనే సమాధానమే లభిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా... మీటింగులు పెట్టి కానుకలు, డబ్బులు ఇస్తున్నారు. ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే అని స్పష్టంగా తెలిసినా ఈసీ పట్టించుకోవడంలేదు. ‘కోడ్‌’ వస్తేకానీ ఈసీకి కోరలు రావా? అప్పటిదాకా ఏం జరిగినా పట్టించుకోరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు ఓటర్లకు దొంగచాటుగా డబ్బులు, మద్యం, కానుకలు పంపిణీ చేయడం చూశాంగానీ... ఎన్నికల కోడ్‌ రాకముందే ఇలా పెద్దఎత్తున ఓటర్లకు కానుకలు పంపిణీ చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1MONEY.jpg

ఓ చేతిలో చీర ప్యాకెట్‌ పట్టుకుని.. మరో చేత్తో తన ప్యాంట్‌ జేబులో నుంచి 500 నోటు తీసి.. పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు మహిళలకు చకచకా అందజేశారు. ప్యాంటు జేబులోంచి ఒక్కో నోటు మాత్రమే బయటకు తీస్తూ మహిళల చేతిలో పెట్టారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం పనుకుపేటలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.

మచ్చుకు కొన్ని..

  • ఇటీవల విశాఖలో ఎంపీ, విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంవీవీ సత్యనారాయణ చీరలు, సౌత్‌ ఇన్‌చార్జ్‌ వాసుపల్లి గణేశ్‌ మందుసీసా, కోడి పంచారు.

  • పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఒక చేత్తో మహిళలకు చీరను ఇస్తూ.. మరో చేత్తో ఐదు వందల నోటు ఇచ్చారు. మంగళవారం తామరఖండి గ్రామంలో వైసీపీ నాయకులు మహిళలకు చీరలు, నగదు పంపిణీ చేశారు.

  • విజయనగరం, విశాఖ జిల్లాల్లో కానుకలు, డబ్బుల పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది.

  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం నియోజకవర్గంలోని వలంటీర్లందరికీ 1700 సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సన్మానం పేరుతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఒక్కొక్కరిని ప్రత్యేక గదిలోకి ఆహ్వానించి రూ.11,999 విలువైన ఫోన్‌లను గిఫ్ట్‌గా అందించారు. తమ పరిధిలోని కుటుంబాలతో వైసీపీకి ఓటు వేయించాలని వలంటీర్లను కోరారు. ఓటు వేయకపోతే పథకాలు కట్‌ చేస్తామని బెదిరించాలని సూచించారు.

  • కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ మనుషులు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో వలంటీర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి రూ.1000 చొప్పున నగదు అందించారు. పోలింగ్‌ సమీపించగానే ఒక్కొక్కరికి రూ.పది వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్‌ పరిధిలోని కుటుంబాలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు సేకరించారు.

  • ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జ్‌లు వలంటీర్లకు కుక్కర్లు, దుస్తులు పంపిణీ చేశారు.

  • విజయవాడ సెంట్రల్‌లో వెలంపల్లి శ్రీనివాస్‌ వలంటీర్లకు ఇటీవల కుక్కర్లు పంపిణీ చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 03:38 AM