Share News

వైసీపీ నేతల ‘కిరాయి’ దందా!

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:34 AM

మిర్చి సీజన్‌ ఉచ్ఛస్థితికి చేరుకోవడంతో.. ఇదే అదనుగా లారీ అసోసియేషన్‌ ముసుగేసుకున్న కొందరు వైసీపీ నాయకులు దందాకు దిగారు. ఈశాన్య రాష్ట్రాలకు లారీ కిరాయిని పెంచాలని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే ఉన్న కిరాయి బాగా

వైసీపీ నేతల  ‘కిరాయి’ దందా!

లారీ అసోసియేషన్‌ ముసుగులో రుబాబు

కిరాయి రూ.1.58 లక్షల నుంచి రూ.1.70 లక్షలకు పెంచాలని డిమాండ్‌

తమ వల్ల కాదని ఎగుమతులు నిలిపేసిన ఎక్స్‌పోర్టర్లు

బయటి లారీలొస్తే టైర్లు కోసేస్తామని బెదిరింపులు

మిర్చియార్డు రోడ్డులో వేబ్రిడ్జి వద్ద టెంటు వేసుకొని మరీ మకాం

గుంటూరు, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): మిర్చి సీజన్‌ ఉచ్ఛస్థితికి చేరుకోవడంతో.. ఇదే అదనుగా లారీ అసోసియేషన్‌ ముసుగేసుకున్న కొందరు వైసీపీ నాయకులు దందాకు దిగారు. ఈశాన్య రాష్ట్రాలకు లారీ కిరాయిని పెంచాలని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే ఉన్న కిరాయి బాగా ఎక్కువగా ఉందని ఎగుమతిదారులు వాపోతుంటే.. పులిమీద పుట్రలా.. తాజాగా లోడుకు రూ.12 వేల వరకు పెంచమని కోరుతుండటంతో తమ వల్ల కాదంటూ వారు చేతులెత్తేశారు. దీంతో గత ఐదు రోజుల నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచాయి. దీని ప్రభావం మిర్చియార్డుపై ప్రత్యక్షంగా చూపిస్తోంది. తమ డిమాండ్‌కు విరుద్ధంగా బయట ఎక్కడి నుంచైనా లారీ తీసుకొచ్చి కిరాయికి పెడితే టైర్లు కోసేస్తామని కొంతమంది బెదిరింపులకు దిగుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎక్స్‌పోర్టర్లు వాపోతున్నారు. బంగ్లాదేశ్‌, చైనా, తైవాన్‌ తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు ఈశాన్య భారత దేశ రాష్ట్రాల నుంచి వెళుతుంటాయి. మిర్చియార్డుకు వచ్చే డిమాండ్‌లో దాదాపుగా 25 శాతం ఎగుమతులు ఈశాన్య రాష్ట్రాలకు జరుగుతుంటాయి. ఏ కారణం చేతనైనా ఎగుమతులు నిలిస్తే దాని ప్రభావం మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్‌ మార్కెట్‌ల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు లారీ కిరాయి రూ. 1.35 లక్షలు మాత్రమే. ఆ మార్కెట్‌లతో పోల్చితే గుంటూరు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు దూరం తక్కువైనప్పటికీ రూ.1.58 లక్షలు వసూలు చేస్తున్నారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు రూ. 1.70 లక్షలకు పెంచాలని హుకుం జారీ చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న రూ.1.58 లక్షల కిరాయిని తగ్గించాలని ఎగుమతిదారులు అనేక సమావేశాల్లో కోరుతుండగా, తగ్గించకపోగా పెంచడంపై ఎగుమతిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం నాలుగైదు లారీలు ఎగుమతి చేసే పెద్ద ఎక్స్‌పోర్టర్లు ఇప్పటికే నిలిపేశారు. దీని వల్ల యార్డులో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. రోజుకు 2.50 లక్షల టిక్కీలు వస్తుంటే అందులో సగం మాత్రమే విక్రయం జరుగుతున్నాయి. ఈ కారణంగా క్వింటాల్‌కు రూ. 5 వేల వరకు దేశవాళీ రకాల మిర్చి ధర పతనమైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ వారంలో ఎగుమతిదారులు సమావేశం ఏర్పాటు చేసుకొని ,చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, ఎవరైనా తక్కువ కిరాయికి లారీ పెడితే అసోసియేషన్‌ పేరుతో కొంతమంది గుంపుగా వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇందుకోసం మిర్చియార్డు రోడ్డులో ఒక వేబ్రిడ్జి వద్ద టెంటు వేసుకొని అక్కడే డ్యూటీలు వేసుకొని ఉంటున్నారు. విజయవాడ నుంచి ఎవరైనా లారీలు తీసుకొచ్చి కిరాయికి పెడితే టైర్లు కోసేస్తామని తమకు బెదిరింపులు వస్తున్నాయని లారీ యజమానులు తెలిపారు. కాగా.. ఎన్నికల కోడ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఈ వైసీపీ నేతల పీడ ఎప్పుడు విరగడవుతుందా అని లారీ యజమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 07:06 AM