Share News

మీరు రోడ్డేస్తే.. మేం తవ్వేస్తాం!

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:42 AM

‘మేం రోడ్లు వేయం. ఇంకెవరైనా వేయిస్తే చూస్తూ ఊరుకోం!’... ఇదీ వైసీపీ నేతల విధానం! అభివృద్ధి చేయరు.. ఎవరైనా చేస్తే ఓర్వలేరు. దీనికి నిదర్శనమే హిందూపురం నియోజకవర్గం లేపాక్షి

మీరు రోడ్డేస్తే.. మేం తవ్వేస్తాం!

కాంట్రాక్టర్‌కు వైసీపీ నాయకుడి బెదిరింపులు

రోడ్డు తొలగించకుంటే కేసు పెడతామని హెచ్చరిక

గత్యంతరం లేక రోడ్డును ధ్వంసం చేసిన కాంట్రాక్టరు

టీడీపీ నిధులతో రోడ్డేశారని అక్కసు

హిందూపురం, జనవరి 28: ‘మేం రోడ్లు వేయం. ఇంకెవరైనా వేయిస్తే చూస్తూ ఊరుకోం!’... ఇదీ వైసీపీ నేతల విధానం! అభివృద్ధి చేయరు.. ఎవరైనా చేస్తే ఓర్వలేరు. దీనికి నిదర్శనమే హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం నాయనపల్లి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఘటన! నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్య ఉందని స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని, విజయవాడ ఎంపీ నిధులు రూ.25 లక్షలతో నాయనపల్లిలో డ్రైనేజీ ఏర్పాటు చేశారు. అందులో రూ.6.5 లక్షలు మిగలగా.. ఆ నిధులతో ఎస్సీ కాలనీలో నాలుగు రోజుల క్రితం సీసీ రోడ్డు వేశారు. ‘వేస్తే మేం వేయాలి. ఇంకొకరు రోడ్డు వేయించడమేంటి’ అంటూ ఓ వైసీపీ నాయకుడు కస్సుమన్నాడు. తమ అనుమతి లేకుండా తమ గ్రామ పరిధిలో రోడ్డు ఎలా వేస్తావని కాంట్రాక్టర్‌ను బెదిరించాడు. కాంట్రాక్టరు సర్దిచెప్పాలని ప్రయత్నించారు. అవసరమైతే మీరే మిగిలిన రోడ్డు వేసుకుని, బిల్లు కూడా చేసుకోవాలని, తనకేమీ అవసరం లేదని చెప్పినా స్థానిక నేత వినిపించకోలేదు. వేసిన రోడ్డును ధ్వంసం చేయకపోతే కేసు పెడతానని బెదిరించారు. దీంతో చేసేదిలేక నష్టం వచ్చినా ఫర్వాలేదనుకుని ఆ కాంట్రాక్టర్‌ తాను వేసిన రోడ్డును ఆదివారం ధ్వంసం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. సదరు వైసీపీ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అధికార పార్టీ నిధులు మంజూరు చేసిందీలేదు, రోడ్లు వేసిందీ లేదు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డు వేయిస్తే దానిని కూడా బెదిరించి, ధ్వంసం చేయించడం దారుణం’ అని మండిపడుతున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 02:42 AM