Share News

వైసీపీలో తిరుగుబాట్లు..

ABN , Publish Date - May 16 , 2024 | 12:01 AM

మండలంలో వైసీపీలో తిరుగుబాట్లు చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఉషశ్రీపై సొంత పార్టీ నాయకులే తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రి ఉషశ్రీ గోరంట్ల మండలంలో ఓ మాజీ సర్పంచ కుటుంబానికి ఎన్నికల్లో ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.

వైసీపీలో తిరుగుబాట్లు..
పోలింగ్‌ రోజు బూదిలిలో సవితకు మద్దతుగా నిలిచిన వైసీపీ నాయకుడు వేణుగోపాల్‌ రెడ్డి (కంటి అద్దాలు పెట్టుకున్న వ్యక్తి)

గోరంట్ల, మే 15: మండలంలో వైసీపీలో తిరుగుబాట్లు చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఉషశ్రీపై సొంత పార్టీ నాయకులే తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రి ఉషశ్రీ గోరంట్ల మండలంలో ఓ మాజీ సర్పంచ కుటుంబానికి ఎన్నికల్లో ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలింగ్‌ రోజు నారసింహపల్లి పంచాయతీలోని ఓ గ్రామంలో సమావేశమై, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు అంటీముట్టనట్లు వ్యవహరించినట్లు సమాచారం. బూదిలి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు, గోరంట్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన వేణుగోపాల్‌ రెడ్డి, ఆయన అనుచరుడు బూదిలి ఎంపీటీసీ మంజునాథ్‌ గౌడ్‌.. మంత్రి ఉషశ్రీ తీరుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు పోలింగ్‌ రోజు బూదిలిలో ప్రత్యక్షమై టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరడంతో అందరూ షాక్‌ అయ్యారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. కూటమి అభ్యర్థి సవిత బూదిలి పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగా.. ఆమెకు మద్దతు పలుకుతూ వేణుగోపాల్‌ రెడ్డి ఫొటోలు దిగారు. వాటిని వైసీపీ నాయకులకు పోస్టు చేయడంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. వెంకటరమణపల్లి పంచాయతీకి చెందిన ఓ నాయకుడు, మందపల్లిలో మరొకరు వైసీపీలో తమకు ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ టీడీపీకి సహకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలింగ్‌ రోజు నుంచి వైసీపీ నాయకుల్లో మునుపటి ఉత్సాహం కనిపించడంలేదన్న వాదనలున్నాయి. పోలింగ్‌ అధికంగా నమోదవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పోలయ్యాయన్న విశ్లేషణల నేపథ్యంలో కూటమి నాయకులు ఆనందపడుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 12:01 AM