Share News

మాయలు, మోసాలకు వైసీపీ సిద్ధం

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:04 AM

ఎన్నికల నేపథ్యంలో మరోసారి మాయలు, మోసాలు చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.

మాయలు, మోసాలకు వైసీపీ సిద్ధం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు జిల్లా రోడ్‌ షోలో బాలకృష్ణ

నెల్లూరు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో మరోసారి మాయలు, మోసాలు చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా గుడ్లూరులో రోడ్‌ షో నిర్వహించి, బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం రాత్రికి నెల్లూరు చేరుకున్న బాలయ్య నగరంలోని నవాబుపేట సెంటర్‌ నుంచి గాంధీబొమ్మ వరకు రోడ్‌ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇక ప్రజల భూములకు రక్షణ ఉండదని చెప్పారు. వైసీపీ అరాచకాలను భరించలేక రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సి దుస్థితి దాపురిస్తుందని బాలకృష్ణ హెచ్చరించారు. తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్మోహన్‌రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారని దుయ్యబట్టారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి, గొడ్డలి అన్నారని, ఇప్పుడు గులకరాయి అంటున్నారని ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని హత్య చేసిన వారిని కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎలా నడపాలో చేతగాక నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. జే బ్రాండ్ల మద్యాన్ని ఏరులై పారించి పేదల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీల నిధులను మళ్లించడమే కాక వారిని హింసించడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు సృష్టించకపోగా వారిని డ్రగ్స్‌, గంజాయికి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. ఈ సభల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కందుకూరు, నెల్లూరు సిటీ, రూరల్‌ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 04:04 AM