అన్నవరంలో ‘వైసీపీ’ నెయ్యి!
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:31 AM
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిని రెండేళ్లుగా ఒకే కంపెనీ సమకూరుస్తోంది. ఆలయ అధికారులు ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నా ప్రతిసారీ ఆ కంపెనీ మాత్రమే ఆర్డరు దక్కించుకుంటోంది.
రెండేళ్లుగా ఒకే కంపెనీకి కాంట్రాక్టు
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిని రెండేళ్లుగా ఒకే కంపెనీ సమకూరుస్తోంది. ఆలయ అధికారులు ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నా ప్రతిసారీ ఆ కంపెనీ మాత్రమే ఆర్డరు దక్కించుకుంటోంది. పైగా ఈ కంపెనీ అన్నవరం ఆలయానికి ఒక ధరకు, విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి మరో ధరకు నెయ్యి సరఫరా చేయడం దుమారం రేపుతోంది. ఈ రెండు ఆలయాలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును గత వైసీపీ ప్రభుత్వంలో రైతు డెయిరీ అనే కంపెనీ దక్కించుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ కంపెనీ సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.344 చొప్పున, అన్నవరం దేవస్థానానికి రూ.538 చొప్పున వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నవరం దేవస్థానానికి విజయ, సంగం డెయిరీల నుంచి ఏటా 1.80 లక్షల కిలోల వరకు నెయ్యి సరఫరా అయ్యేది. కానీ గత వైసీపీ సర్కారు 2022 నుంచీ వీటిని పక్కకు తప్పించి అనామక కంపెనీతో నెయ్యి సరఫరా చేయిస్తోంది. రెండేళ్ల నుంచి రైతు డెయిరీ కంపెనీకే టెండరు దక్కడంలో వైసీపీ పెద్దల కమీషన్ల బాగోతం ఉందని చెబుతున్నారు.