Share News

అరాచకాలు సృష్టించింది వైసీపీయే

ABN , Publish Date - May 21 , 2024 | 02:59 AM

రాష్ట్రంలో అరాచకాలను సృష్టించిన వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

అరాచకాలు సృష్టించింది వైసీపీయే

వాటిని టీడీపీపై రుద్దే ప్రయత్నం.. దుష్ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు

పరువు నష్టం దావా వేస్తాం: టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో అరాచకాలను సృష్టించిన వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కులం రంగుపులిమి, అధికారులతో లేని సంబంధాలను అంటగట్టి మేం లబ్ధి పొందినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. సోమవారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అధికారులను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందామని వైసీపీ, వైసీపీ బ్లూ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై సిట్‌ విచారణ జరిపి నిజాలను బయట పెట్టాలి. కాల్‌డేటా బయటకు తీసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు ప్రచారంపై ఈసీ, సిట్‌ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. పరువు నష్టం దావాకు చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ మా కుటుంబానికి పరిచయం ఉన్నట్లు, టీడీపీ చెప్పినట్లు పోలీసులు వినడంతోనే పల్నాడులో హింస జరిగిందని జగన్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. నావైపు తప్పుంటే నాపేరును కూడా చార్జ్‌షీట్‌లో చేర్చాలి. ప్రలోభాలకు గురిచేశామని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై నిజాలు బయటపెట్టాలి’ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సోమవారం ఓ ప్రకటన చేస్తూ... ‘తప్పు చేయడం, ఆ తప్పును ఎదుటివారిపై నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పోలింగ్‌ రోజు ఓటర్లు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి, సిగ్గు లేకుండా టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఓటమి భయంతో పల్నాడును వల్లకాడు చేశారు’ అని ధూళిపాళ్ల మండిపడ్డారు.

Updated Date - May 21 , 2024 | 07:25 AM