Share News

వైసీపీ శవ రాజకీయం

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:48 AM

ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. పింఛన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని, ఆ పాపమంతా విపక్ష నేత చంద్రబాబుదేనంటూ విష ప్రచారం చేస్తోంది.

వైసీపీ శవ రాజకీయం

3 నెలల కిందటే రద్దయిన పింఛన్‌ కోసం

వెళ్లి వృద్ధురాలు చనిపోయిందని ఏడుపు

6 నెలలుగా మంచమే దిగలేదన్న కుటుంబం

నిజమేనని ధ్రువీకరించిన ఎంపీడీవో, ఈవో

అయినా.. విపక్షాలపై వైసీపీ నేతల నిందలు

రోత పత్రికలో రోత రాతలు.. విష ప్రచారం

కోసిగి, ఏప్రిల్‌ 5: ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. పింఛన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని, ఆ పాపమంతా విపక్ష నేత చంద్రబాబుదేనంటూ విష ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఎక్కడైనా వృద్ధులు చనిపోతే అక్కడకు వైసీపీ నాయకులు వాలిపోయి ‘‘ఈ చావులకు కారణం చంద్రబాబే’’ అంటూ దుర్మార్గపు ప్రచారానికి పాల్పడుతున్నారు. దీనికి తోడు రోత పత్రికలో రోత రాతలు ప్రచురిస్తూ అబద్ధాలను వాస్తవాలుగా చూపించే కుట్రకు పాల్పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగిలో గురువారం మరణించిన 75 ఏళ్ల వృద్ధురాలి విషయంలోనూ ఇదే అరాచకానికి పాల్పడ్డారు. ఆమె పింఛను కోసం వెళ్లి.. మృతి చెందారంటూ రోత రాతలతో అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆమెకు మూడు మాసాల కిందటే ప్రభుత్వం పింఛను నిలుపుదల చేసింది. అయినా.. ఇప్పుడు ఆమె.. వలంటీర్లను ఆపేయడంతో పింఛను కోసం వెళ్లి చనిపోయారంటూ ప్రచారం చేయడంపై వృద్ధురాలి కుటుంబమే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఏం జరిగింది?

కోసిగి మండల కేంద్రంలోని 6వ వార్డులో నాడిగేని ముత్తమ్మ(75) అనే వృద్ధురాలు గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. ఆరు నెలల నుంచి ఆమె మంచానికే పరిమితమై.. కాలుకింద పెట్టలేని స్థితిలో ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబరు నుంచి కోసిగిలోని సచివాలయం-3 వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ప్రీతి ప్రతినెలా వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్‌ అందిస్తున్నారు. అయితే, జనవరి నెలలో వృద్ధురాలు ముత్తమ్మ ఆధార్‌కు ఈకేవైసీ కాకపోవడంతో అదే నెల 25న ముత్తమ్మ పింఛన్‌ను తొలగించారు. దీంతో ఆమెకు మూడు నెలలుగా పింఛనే లేకుండా పోయింది. జరిగింది ఇదీ. కానీ, శుక్రవారం రోత పత్రికలో ‘పింఛన్‌ కోసం వెళ్లి వృద్ధురాలి మృతి’ పేరుతో వార్తను ప్రచురించారు. దీనిలో కల్పిత కథను వండివార్చారు. కాగా, పింఛన్‌ కోసం వెళ్లి వృద్ధురాలి మృతి’ వార్త నిజం కాదని కోసిగి ఎంపీడీవో ప్రభావతి తెలిపారు.

ఆరు నెలలుగా మంచానికే పరిమితం

ముత్తమ్మ ఆరు నెలల నుంచి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అయితే, గురువారం పింఛన్‌ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి అన్న వార్త రావడం బాధాకరం. వృద్ధురాలి పింఛన్‌ జనవరిలోనే డిలీట్‌ అయింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.

- తిరుమలేశ్వరరెడ్డి, కోసిగి పంచాయితీ ఈవో

Updated Date - Apr 06 , 2024 | 03:50 AM