Share News

వైసీపీ అభ్యర్థులు పారిపోతున్నారు

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:00 AM

‘అధికారంలో ఉన్న పార్టీ రోజుకో అభ్యర్థిని మార్చుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితిని ఈ రాష్ట్రంలో మొదటిసారి చూస్తున్నాం. ఎంపిక చేసిన అభ్యర్థులు పారిపోతుంటే రోజుకో కొత్త అభ్యర్థిని వెతుక్కొని తెచ్చి ప్రకటించుకోవాల్సి వస్తోంది’ అని అధికార వైసీపీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌

వైసీపీ అభ్యర్థులు పారిపోతున్నారు

అందుకే రోజుకో అభ్యర్థిని మారుస్తున్నారు: టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉన్న పార్టీ రోజుకో అభ్యర్థిని మార్చుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితిని ఈ రాష్ట్రంలో మొదటిసారి చూస్తున్నాం. ఎంపిక చేసిన అభ్యర్థులు పారిపోతుంటే రోజుకో కొత్త అభ్యర్థిని వెతుక్కొని తెచ్చి ప్రకటించుకోవాల్సి వస్తోంది’ అని అధికార వైసీపీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా గురువారం విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తోందని, దాన్ని ఆపాలన్న ఆరాటంలో అభ్యర్థుల ఎంపికను ఒక ప్రహసనంగా మార్చారని అన్నారు. చిత్తూరు వ్యక్తిని తెచ్చి ఒంగోలులో, నెల్లూరు నేతను తీసుకువెళ్లి నర్సరావుపేటలో, వేమూరు వ్యక్తిని తీసుకువెళ్లి సంతనూతలపాడులో పెడుతున్నారని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని చోద్యాలు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఆ పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా తయారవడం వల్లే వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీల ముందు క్యూ కడుతున్నారని నాగుల్‌ మీరా వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత జగన్‌ బెంగుళూరు ప్యాలె్‌సకు పరారు కావడం ఖాయమని, తాడేపల్లి ప్యాలె్‌సలో సామాన్లు సర్దడం ఇప్పటికే మొదలుపెట్టారని అన్నారు.

గూడెం సభ చూసి వణుకు: మాణిక్యాలరావు

తాడేపల్లి గూడెం సభ చూసి తాడేపల్లి ప్యాలె్‌సలో పిల్లులకు వణుకు మొదలైందని టీడీపీ అధికార ప్రతినిధి పి. మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు. ‘ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పడానికి ఏకంగా ఐదుగురు మంత్రులు వచ్చారు. వారు ఎంత భయపడుతున్నారో దీన్ని బట్టే తెలుస్తోంది. ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ పని అయిపోయింది. వై నాట్‌ జాబ్‌ క్యాలెండర్‌... వై నాట్‌ డిఎస్సీ... వై నాట్‌ ఉచిత ఇసుక.. అని చంద్రబాబు ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు కిక్కురుమనడం లేదు. చీటింగ్‌ గ్యాంగ్‌ కథ ముగిసిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

లక్ష్మీ పార్వతి పరువు తీస్తున్న పేర్ని నాని: నాదెండ్ల బ్రహ్మం

సొంత పార్టీలో ఉన్న లక్ష్మీ పార్వతి పరువును వైసీపీ నేత పేర్ని నాని గంగలో కలుపుతున్నారని టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం వ్యాఖ్యానించారు. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌ అని మేం అడుగుతుంటే హూ కిల్డ్‌ ఎన్టీఆర్‌ అని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ చనిపోయినప్పుడు ఆయన ఇంట్లో పక్కన లక్ష్మీ పార్వతి ఉన్నారు. కాబట్టి ఆమెనే అడగాలి. పేర్ని నాని మాటలు వింటే ఎన్టీఆర్‌ మరణంలో లక్ష్మీ పార్వతిని అడ్డు పెట్టుకొని రాజశేఖరరెడ్డి ఏదైనా చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఆయన అన్నారు. జగన్‌ ఇప్పటివరకూ తనకు సీటు ఖరారు చేయకపోవడంతో మంత్రి రోజాకు మతి భ్రమించిందని, జగన్‌ను కాకా పట్టడానికి ఆమె నానా తంటాలు పడుతున్నారని బ్రహ్మం ఎద్దేవా చేశారు. 60 రోజుల తర్వాత ఆమెకు పూర్తి విశ్రాంతి దొరుకుతుందని, హాయిగా టీవీ షోల్లో పాల్గొనవచ్చని సూచించారు.

Updated Date - Mar 01 , 2024 | 08:50 AM