ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:59 AM
జనసేన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ‘ప్రతి చేతికీ పని... ప్రతి చేనుకీ నీరు’ అనే లక్ష్యం దిశగా కమిటీ చర్చలు సాగాయి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశం అయ్యారు.

వ్యవసాయం, ఉద్యోగం, యువతకు ఉపాధి
జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ... సుదీర్ఘ చర్చ
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ‘ప్రతి చేతికీ పని... ప్రతి చేనుకీ నీరు’ అనే లక్ష్యం దిశగా కమిటీ చర్చలు సాగాయి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశం అయ్యారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల, వ్యవసాయ రంగానికి అండగా నిలవడం, పేదల సంక్షేమం, మహిళా భద్రత, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాపు సంక్షేమ సేన తరఫున ఆ సంస్థ వ్యవస్థాపకులు చేగొండి హరిరామజోగయ్య పంపించిన పీపుల్స్ మేనిఫెస్టోపై చర్చించారు. జనసేన మేనిఫెస్టో కమిటీని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, పార్శిల్ లారీ అసోసియేషన్, ట్రాలర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి రవాణా రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు తమ సమస్యలను, నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించి వినతిపత్రం అందచేశారు.
జనసేనానిని కలిసిన పలువురు నేతలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను పలువురు నేతలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య, పవన్‌తో భేటీ అయ్యారు. జనసేనానితో మర్యాదపూర్వకంగా సమావేశమైన మాగంటి బాబు... సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, పవన్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలు భేటీలో చర్చకు వచ్చాయి.