డేటా ఎత్తేసిన దొంగ తోడేళ్లు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:29 AM
గనుల శాఖలో నిధుల దారి మళ్లింపు వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడంతో దొంగ తోడేళ్లు అప్రమత్తమయ్యాయి.

హోటల్ నుంచి ‘మైనింగ్’ ఆపరేషన్
డైరెక్టరేట్ కంప్యూటర్లలోకి చొరబాటు
ఆఫీసులు సీజ్‌తో హోటల్‌లో కూర్చుని
ఆన్‌లైన్ ద్వారా లాగ్‌డేటా డిలీట్
ఓ ఐటీ ఇంజనీర్ సాయంతో వ్యవహారం
ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్‌లూ ఫార్మాట్
రికవరీకి సాధ్యంకాని విధంగా మాయం
గనుల శాఖలో తోడేళ్ల సరికొత్త పన్నాగం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల శాఖలో నిధుల దారి మళ్లింపు వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడంతో దొంగ తోడేళ్లు అప్రమత్తమయ్యాయి. తమ అవినీతి, అక్రమాల లోగుట్టు బయటపడటం ఖాయమని గుర్తించిన దొంగలు తమ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మంగళవారం సరికొత్త ఎత్తుగడ వేశారు. మంగళగిరిలోని ఓ పెద్ద హోటల్ రూమ్ తీసుకొని అక్కడి నుంచే మంత్రాంగాన్ని నడిపారు. నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను పిలిపించుకొని అతని ద్వారా గనుల శాఖ డైరెక్టరేట్‌లోని కంప్యూటర్లలోకి ఆన్‌లైన్‌ద్వారా చొరబడేందుకు, సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించేందుకు( ఎరేజ్) విశ్వప్రయత్నాలు చే శారు. మరోవైపు ప్రభుత్వం తమకు ఇచ్చిన ల్యాప్‌టా్‌పల్లో ఉన్న డేటాను పూర్తిగా తొలగించి వాటిని రికవరీకి సాధ్యంకాని రీతిలో ఫార్మాట్ చేసినట్లు తె లిసింది. పెద్ద అవినీతి తొడేలుకు అండదండలందించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన మరో ముగ్గురు సీనియర్లు ఈ మంత్రాంగంలో పాల్గొన్నట్లు తెలిసింది. గనుల శాఖ డైరె క్టరేట్ పరిధిలో ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును కొందరు ఉన్నతాధికారులు.....చిరుద్యోగుల సహకారంతో కాజేసిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి కేసు పెద్ద అధికారులపై రాకుండా కేవలం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపైనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, నిధుల దారిమళ్లింపు పెద్ద అధికారులకు తెలిసే జరిగిందనేలా సాంకేతిక అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. నిధుల విడుదల ఫైళ్లను ఆమోదించే సమయంలో మూడు స్థాయుల్లో అధికారుల డాంగిల్స్ వాడారు. దాంతోపాటు వారి వేలిముద్రలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కంప్యూటర్ రికార్డుల్లో, గనుల శాఖ డైరెక్టరేట్ ఈ-ఫైలింగ్ సర్వర్లలో నిక్షిప్తమై ఉన్నాయి. తమకు సంబంధం లేదని పెద్ద అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా, ఆఫీసు ఫైళ్లు వారి బండారాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో గనుల శాఖ డైరెక్టరేట్ ఈ-ఆఫీసు సర్వర్లలో ఉన్న డేటాను తొలగించాలని నిధుల దుర్వినియోగం దందాలో భాగస్వాములైన ముగ్గురు పెద్ద అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం రెండు ఆఫీసులను ప్రభుత్వం సీజ్ చేయడంతో భౌతికంగా ఆఫీసులకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకొని డైరెక్టరేట్ సర్వర్‌ను హ్యాక్‌చేసి డేటాను, దాంతోపాటు డేటా లాగ్స్‌ను తొలగించాలని పన్నాగం పన్నారు. అయితే, ఈ పని అక్రమాల్లో భాగస్వాములైన ఆ ముగ్గురి అధికారులతోనే సాధ్యమయ్యేది కాదు. దీంతో డైరెక్టరేట్‌లోని ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఓ ఐటీ ఇంజనీరుతో ఈ పని చేయించాలనుకున్నారు. ఇందుకు మంగళగిరిలోని ఓ ప్రముఖ హోటల్ ను ఎంచుకున్నారు. మూడో అంతస్తులోని ఓ రూమ్ కేంద్రంగా ఆన్‌లైన్ ఆపరేషన్ చేశారు. రిమోట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సర్వర్లలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముగ్గురు అధికారులకు సంబంధించి ఫైల్ డేటా లాగ్స్‌ను తొలగించినట్లుగా తెలిసింది. దీంతోపాటు ఆ ముగ్గురికి ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టా్‌పలను కూడా పార్మాట్ చేసినట్లు సమాచారం. నిధుల దుర్వినియోగం కేసులో విచారణ మలుపుతిరిగి వీరిని విచారిస్తే ల్యాప్‌టాప్ డేటా కీలకం కానుంది. దీంతో ఒకవేళ రికవరీ చేసినా ఒక్క పైల్ కూడాతిరిగిరాకుండా వాటిని ఫార్మాట్ చేశారు.