Share News

గవర్నర్‌ అనుమతి లేకుండానే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:50 AM

మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు మరో చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 18 ప్రకారం ప్రజాప్రతినిధులపై చార్జిషీటు దాఖలు చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి.

గవర్నర్‌ అనుమతి లేకుండానే..

స్కిల్‌ కేసులో బాబుపై చార్జిషీటు

బెజవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు

విజయవాడ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు మరో చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 18 ప్రకారం ప్రజాప్రతినిధులపై చార్జిషీటు దాఖలు చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. అయినప్పటికీ దీనిని పట్టించుకోకుండా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం ఈ చార్జిషీటు వేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆయనపై ఫైబర్‌నెట్‌, అసైన్డ్‌ భూముల కేసులకు సంబంధించి చార్జిషీట్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ రెండూ న్యాయస్థానం పరిశీలనలో ఉన్నాయి. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.176.27 కోట్లు దారి మళ్లించారంటూ క్రైం నంబర్‌ 29/2021తో ఐపీసీ సెక్షన్లు 120(బీ), 166, 167, 418, 420, 465, 468, 471, 477ఏ 409, 201, 109 రెడ్‌ విత్‌ 34, 37.. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌ విత్‌ 13 (1), (డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, స్కిల్‌ కార్పొరేషన్‌ మాజీ ఉన్నతాధికారులు గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, సీమెన్స్‌, డిజిటెక్‌, పీవీఎస్పీ/స్కిల్లర్‌ సంస్థల ప్రతినిధులు సహా 41 మందిని నిందితులుగా చేర్చారు.

Updated Date - Apr 05 , 2024 | 07:46 AM