Share News

ముస్లిం సంఘాల మద్దతుతో టీడీపీకి ఊరట

ABN , Publish Date - May 12 , 2024 | 03:58 AM

ఎన్నికల ముందు పలు ముస్లిం సంఘా లు మద్దతు ప్రకటించడంతో టీడీపీకి ఊరట లభించింది.

ముస్లిం సంఘాల మద్దతుతో టీడీపీకి ఊరట

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు పలు ముస్లిం సంఘా లు మద్దతు ప్రకటించడంతో టీడీపీకి ఊరట లభించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతిచ్చిన కొన్ని జాతీయస్థాయి ముస్లిం సంఘాలు ఈసారి టీడీపీకి బహిరంగ మద్దతు ప్రకటించడం విశేషం. జాతీయస్థాయి, ప్రాంతీయ స్థాయి కలిపి మొత్తం 17 సంఘాలు తమకు మద్దతు ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ముస్లిం మత పెద్దల జాతీయ స్థాయి సంస్థ తన్జీయ్‌ ఎ ముఫ్తియాన్‌ ప్రధాన నిర్వాహకులు నేరుగా హైదరాబాద్‌ వచ్చి చంద్రబాబును కలిసి తమ మద్దతు ప్రకటించారు. దేశంలోని ప్రముఖ ముస్లిం సంస్థల్లో ఒకటైన జమాతుల్‌ ఉలేమా ఎ హింద్‌ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలని కోరుతూ బహిరంగ ప్రకటన చేశారు. సౌత్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపింది. ఈసారి కూడా ఆ సంస్థ తమ మద్దతు టీడీపీకే ఇస్తున్నట్లు పేర్కొంది. విశాఖలో ఈ నెల 10న వందల సంఖ్యలో రాష్ట్ర స్థాయి ముస్లిం మతపెద్దల సమావేశం జరిగింది. ఇందులో అఖిల భారత ఉలేమా కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్‌ ఫారుఖ్‌ ఖాసిమి పాల్గొని టీడీపీకి మద్దతు ప్రకటించారు. గతంలో వైసీపీకి మద్దతు ప్రకటించి పెద్దతప్పు చేశామని, దాన్ని దిద్దుకోవడానికి ఈసారి చంద్రబాబుకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత ఇమామ్‌ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఖారి నవీద్‌ కమాల్‌ ఖాదిరి టీడీపీకి మద్దతు ప్రకటించినవారిలో ఉన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకం ఈ సంస్థల్లో వ్యక్తమైందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - May 12 , 2024 | 07:32 AM