వైసీపీ ఓటమితో... మూగబోయిన జడ్పీటీసీలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:21 PM
జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం 10-30 నిమిషాలకు ప్రారంభించారు. ఆయా కమిటీల చైర్మన్‌లు సమావేశ వేదికపై అధికారులు వినిపిస్తున్న ప్రగతి నివేదికలను వింటూ ఉత్సవ విగ్రహాల్లాగా ఉండిపోయారు.

ఉత్సవ విగ్రహాల్లా కమిటీల చైర్మన్‌లు
సమస్యలను పట్టించుకోని వైనం
చుట్టం చూపునకే పరిమితం
పేలవంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం
సాధారణ ఎన్నికల ఫలితాలలో అటు రాష్ట్రంలోను, ఇటు మాజీ సీఎం జగన్ జిల్లాలోను వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. జూన్ 4న ఫలితాలు వెలువడిన నాటి నుంచి వైసీపీ క్యాడర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నిద్రపట్టని రోజులను గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జడ్పీ సమావేశహాలులో నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వైసీపీ జడ్పీటీసీ సభ్యుల గొంతు పూర్తిగా మూగబోయింది. 50 మంది జడ్పీటీసీలు ఉండగా కేవలం 20 మందిలోపే హాజరయ్యారు. వీరిలో కూడా కేవలం పోరుమామిళ్ల జడ్పీటీసీ ముత్యాల చెన్నయ్య మాత్రమే పసలేని మూడు నాలుగు సమస్యలపై పెదవి విప్పారు. మిగిలిన వారంతా చుట్టం చూపునకే పరిమితమయ్యారు. ఏడు సంఘాల పరిధిలోని వివిధ శాఖలపై కేవలం 40 నిమిషాలు మాత్రమే ఆయా అధికారులతో మొక్కుబడిగా సమీక్ష నిర్వహించారు.
కడప(రూరల్) జూన్ 7: జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం 10-30 నిమిషాలకు ప్రారంభించారు. ఆయా కమిటీల చైర్మన్‌లు సమావేశ వేదికపై అధికారులు వినిపిస్తున్న ప్రగతి నివేదికలను వింటూ ఉత్సవ విగ్రహాల్లాగా ఉండిపోయారు. ఇదివరకు జడ్పీ చైర్మన్ హోదాలో ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన ప్రణాళిక మరియు ఆర్థికస్థాయి, గ్రామీణాభివృద్ధి, నిర్మాణపు పనులు, విద్య మరియు వైద్యసేవల స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించేవారు. ఆయన ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన కారణంగా శుక్రవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో చైర్మన్ నేతృత్వంలోని పై నాలుగు కమిటీలను కలుపుకుని వ్యవసాయశాఖ కమిటీ చైర్మన్ బాలయ్య (వైస్ చైర్మన్-2), మహిళా సంక్షేమం స్థాయి సంఘం అధ్యక్షురాలు జె.శారద (వైస్ చైర్‌పర్సన్-1), సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్‌పర్సన్ సి.పుష్పలతలు కలిసి సమష్టిగా నిర్వహించినప్పటికీ.. ఏ ఒక్కరు సమావేశాలను సజావుగా జరిపించలేదు.
పేలవంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం
జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని పేలవంగా నిర్వహించారు. ఉదయం 10-40 గంటలకు ప్రారంబించి 11-20 నిమిషాలకు మమ.. అనిపించారు. సమావేశాల్లో ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చలేకుండా సాగించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లారు. సమావేశ ప్రారంభం నుంచి ఒక్కొక్కశాఖకు 7 నిమిషాల వ్యవధికూడా కేటాయించకుండా పరుగో.. పరుగు అన్నట్లుగా సాగించారు. మొత్తంగా ఉన్న 7 స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఒకేచోట ఒకదాని తరువాత ఒకటి టకటకా నిర్వహించి ఓ పనైపోయిందని చేతులు దులిపేసుకున్నారు.
ప్రశ్నలేదు.. సమాధానం లేదు..!
ఇప్పటి వరకు నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలలో ఏనాడూ ఆయా శాఖల పనితీరుపై పూర్తిగా అర్థవంతమైన చర్చ కొనసాగించలేదు. ఆ పరంపరను శుక్రవారం కూడా కొనసాగించారు. ఆయా కమిటీల చైర్మన్ల నుంచి కానీ సభ్యుల నుంచి కానీ ప్రశ్నలు లేకపోవడంతో అధికారులు కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేకుండా సరిపుచ్చారు. సమావేశాల పేరుతో ఖర్చులు మాత్రం తడిపి మోపెడవుతున్నాయి.
బాధ్యతను మరిచిన ప్రజాప్రతినిధులు
శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. ప్రస్తుతం 2024 ఖరీఫ్ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించి వర్షాలు ఆశాజనకంగా పడుతున్నాయి. అయినప్పటికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను నిన్నటి వరకు (జూన్ 4 వరకు) అధికారం ఉన్న వైసీపీ ప్రభుత్వం అందించలేదు. దీంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పారిశుధ్యపు పనులు సక్రమంగా కొనసాగడంలేదు. గ్రామీణ మంచినీటి సరఫరా పఽథకం నత్తనడకన సాగుతోంది. మట్టిమాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో విద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులకు అవసమైన పాఠ్యపుకాలు, మౌలిక వసతుల కొరత పరిపాటిగా వస్తోంది. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో చర్చించి పరిష్కారం చూపాల్సిన గురుతర బాధ్యతను ప్రజాప్రతినిధులు మరిచిపోయి సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు.
అధికారులే బహుబాగు
శుక్రవారం నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి కడప, అన్నమయ్య జిల్లాల ఆయాశాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఆయా కమిటీల పరిధిలోని శాఖల అధికారులు వారి పరిధిలోని సమాచారాన్ని, సంక్షేమాన్ని, పఽథకాలను, అభివృద్ధిని వెల్లడించారు. ఏవైనా సందేహాలు ఉంటే సమాధానాలు వినిపిస్తామని చెప్పారు. కానీ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
చైర్మన్ చాంబర్‌లో వైసీపీ ఓటమిపై చర్చ
జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని వైసీపీ జడ్పీటీసీ సభ్యులంతా త్వరత్వరగా ముగించుకుని చైర్మన్ చాంబర్‌కు చేరుకున్నారు. అక్కడ మహిళా జడ్పీటీసీల బంధువులు, కొందరు వైసీపీ నాయకులతో కలిసి ఇటీవల వెలువడిన సార్వత్రిక ఫలితాలలో వైసీపీ ఓటమిపై చర్చించుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గానీ, కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వలనే ఓటమికి కారణాలుగా చెప్పుకొచ్చారు. సమస్యలను ఎంత చెప్పినా వినిపించుకోలేదని.. బటన్లు నొక్కితే సరిపోదని ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనమని మాట్లాడుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల స్వయం కృతాపరాధమే ఓటమికి కారణమని నిట్టూర్చారు. కాగా.. ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయించారని వాటికి నిధులు ఇవ్వకుండానే వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తమను సర్వనాశనం చేసిందని పనులు చేపట్టిన కొందరు ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. తాము రూ.3 కోట్లకు పనులు చేశామని ఇప్పుడు బిల్లులు రాకుంటే ఏ బాయిలో దూకాలో తెలీడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.